లోతట్టు ప్రాంతాలు నీట మునిగినా పట్టించుకోని ఎమ్మెల్యే
పునరావాస కేంద్రాలను సైతం పట్టించుకోని కూటమి నేతలు
ప్రజాప్రతినిధి తీరుపై మండిపడుతున్న తిరుపతి వాసులు
గతంలో భూమన అందించినసేవలను గుర్తుచేసుకుని ప్రశంసలు
వాయుగుండం ప్రభావంతో తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు జలమయమయ్యాయి. మురుగు కాలువలు ఉప్పొంగడంతో కాలనీలకు కాలనీలే దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలు ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఉంటే స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాత్రం అడ్రస్ లేకుండా పోయారు. బాధితులను ఆదుకోవడం సంగతి దేముడెరుగు.. కనీసం పరామర్శించి పాపాన పోలేదు. అధికారులు ఏర్పాటు చేసిన పునరావాసకేంద్రాలను సైతం సందర్శించలేదు.
ఈ క్రమంలోనే టీడీపీ నాయకులు సైతం కనుచూపు మేరలో కనిపించకుండా పోయారు. కూటమి నేతల వైఖరిపై నగరవాసులు మండిపడుతున్నారు. ఆపత్కాలంలో ఆదుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వరదలు వచ్చినప్పుడు అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అందించిన సేవలను గుర్తుచేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షించిన తీరును కొనియాడుతున్నారు.
తిరుపతి తుడా : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తిరుపతి నగరంలో కుంభవృష్టి కురుస్తోంది. రోడ్లపై వర్షపు నీరు భారీగా ప్రవహిస్తోంది. డ్రైనేజీలు పొంగడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతో స్థానికుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. బాధితులను ఆదుకునే వారు కరువయ్యారు. పునరావాస కేంద్రాలకు చేరిన ముంపు ప్రాంతవాసులను ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఇప్పటి వరకు తిరుపతి ఎమ్మెల్యే, కూటమినేతలు వాటిని ఆ కేంద్రాల్లో ప్రజలు ఎలా ఉన్నారో కనీసం పరామర్శించలేదని పలువురు విమర్శిస్తున్నారు. కష్టకాలంలో అండగా నిలవాల్సిన ఎమ్మెల్యే అడ్రస్ లేకుండా పోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు మాత్రం వేయించుని, అధికారం చేపట్టి, ప్రజలు నరకం అనుభవిస్తుంటే పలకరించేందుకు కూడా రాలేదని వాపోతున్నారు.
మాజీ ఎమ్మెల్యేపై ప్రశంసలు
గతంలో ఇలాగే తిరుపతిలో భారీ వర్షాలు కురిసి లోతట్టు ప్రాంతాలు జలమయమైన సందర్భంలో అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అందించిన సేవలు మరువలేమని ప్రజలు ప్రశంసిస్తున్నారు. చిమ్మ చీకట్లో, నడుము లోతు నీటిలో క్షేత్రస్థాయిలో పర్యటించి ధైర్యం చెప్పిన తీరును చర్చించుకుంటున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి క్షేమ సమాచారాలు తెలుసుకున్నారని గుర్తుచేసుకుంటున్నారు.
అప్పట్లో వర్షాలకు పాక్షికంగా దెబ్బతిన్న గృహాలకు రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం అందించారని వెల్లడిస్తున్నారు. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50వేలు వంతున సాయం చేశారని వివరిస్తున్నారు. పునరావాస కేంద్రంలో చేరిన ప్రతి వ్యక్తికీ రూ.2వేలు పంపిణీ చేసి మానవత్వం చాటుకున్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు. భూమన స్ఫూర్తితో ఇప్పుడు కూడా వర్ష బాధితులకు ఆర్థికంగా చేయూత అందించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment