వసూల్ రాజాలు!
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో..
● ఎన్‌జీ స్టాంప్‌లున్నా విక్రయించరు ● బయట స్టాంప్ వెండర్స్ వద్దే కొనాలి ● నకలు సర్టిఫికెట్ కావాలన్నా సమర్పించుకోవాలి ● భూమి, స్థలం విలువ సర్టిఫికెట్ కావాలన్నా అదే తీరు ● వసూళ్లకు కార్యాలయాల్లో ప్రైవేటు వర్కర్లు
సాక్షి టాస్క్‌ఫోర్స్: తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయివేటు వ్యక్తుల దందా కొనసాగుతోంది. స్థలమో.. భూమో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ముందుగా వారిని సంప్రదించాలి. ఆపై వారు అడిగిన మొత్తాన్ని ముట్టజెప్పాలి. లేదంటే సంబంధిత అధికారులు చుక్కలు చూపిస్తారు. రేపు.. ఎల్లుండి అంటూ కాళ్లరిగేలా తిప్పుకోవడం షరామామూలైపోతోంది. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మొత్తం 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి, తిరుపతి రూరల్, చిత్తూరు అర్బన్, పలమనేరు, కుప్పం, పుంగనూరు వంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజూ 30 నుంచి 60 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. మిగిలిన వాటిలో కనీసం అంటే 20కి తగ్గవు. ఇలా రెండు జిల్లాల్లో రోజూ సుమారు 3,500 నుంచి 4వేల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి.
ప్రైవేటు వ్యక్తులతో వసూళ్ల పర్వం
రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చే వారి నుంచి కొందరు అధికారులు మామూళ్లు పుచ్చుకోందే పనిచేసి పెట్టరనే విషయం జగమెరిగిన సత్యం. నేరుగా లంచం తీసుకుంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని ఏసీబీ రైడ్స్‌కు భపడి కొందరు అధికారులు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తులను నియమించుకున్నారు. అదేవిధంగా మరి కొందరు అటెండర్లు ద్వారా వసూలు చేసుకుంటున్నారు. ఏపనైనా వీరి ద్వారా జరిగేలా అధికారులు వ్యవహరిస్తుంటారు. ప్రతి రిజస్ట్రేషన్, సర్టిఫికెట్స్ కావాలంటే బ్రోకర్‌ని కలవాలి. అతను అడిగినంత ఇస్తే అన్ని వ్యవహారాలు చక్కబెట్టి పంపుతాడు. అలా రోజంతా వసూలైన మొత్తంలో అదే రోజు రాత్రి సంబంధిత అధికారులకు పంచిపెడుతారని కార్యాలయంలో పనిచేసే చిరుద్యోగి ఒకరు వివరించారు. గత కొంత కాలం వరకు ఓ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే ఒక అటెండర్ అధికారులను బ్లాక్ మెయిల్ చేసి విచ్చలవిడిగా రిజిస్ట్రేషన్లు చేయించడం, వసూళ్లు చేయడం వంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ అటెండర్‌కి ఏ అధికారైనా భయపడాల్సిందేననే ప్రచారం ఉంది. శ్రీకాళహస్తి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అయితే ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రయివేటు వ్యక్తులు ఏది చెబితే అదే శాసనంగా తయారైంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే ఈ వ్యవహారాలపై ఉన్నతాధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
సమర్పించుకుంటే వెంటనే సర్టిఫికెట్స్
రిజిస్ట్రేషన్లకే కాకుండా అనేక మంది భూ, ప్లాట్ల విలువ సర్టిఫికెట్ల కోసం కార్యాలయాలకు వస్తుంటారు. అదే విధంగా రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని పుస్తకాల్లో ఉన్న నకలు సర్టిఫికెట్స్ కోసం వచ్చే వారు అనేక మంది ఉన్నారు. ఇవి ఇవ్వడానికి ఒక రోజులో పని. అయితే కార్యాలయాల్లో పనిచేసే కొందరు అధికారులు మామూళ్ల కోసం రేపు , ఎల్లుండి అంటూ తిప్పించుకోవడం సర్వసాధారణంగా మారింది. అదేమని అడిగితే సర్వర్లు పనిచేయలేదని తేలిగ్గా చెప్పేస్తారు. అదేవిధంగా వివాహ రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారు మామూళ్లు ఇవ్వకపోతే ఆ జంట రోజంతా కార్యాలయంలోనే పడిగాపులు కాయాల్సిందే.
స్టాంప్ పేపర్లు బ్లాక్‌లో కొనాల్సిందే
రోజూ రిజిస్ట్రేషన్ల కోసం వేల సంఖ్యలో స్టాంప్ పేపర్లు అవసరం. అటువంటి స్టాంప్ పేపర్లను ప్రభుత్వం సరఫరా చేస్తున్నా.. ప్రైవేటు వెండర్లు ఇచ్చే కమీషన్లకు కక్కుర్తిపడి కార్యాలయాల్లో విక్రయించడం మానేసినట్లు సమాచారం. అందుకు తిరుపతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయమే నిదర్శనం. ఎన్‌జీ స్టాంప్ పేపర్లు ఉన్నా.. కార్యాలయంలో విక్రయించడం లేదు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారు చేసేది లేక ప్రైవేటు వెండర్స్ వద్ద అదనంగా చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రతి రిజిస్ట్రేషన్‌కి 4 నుంచి 7 పేపర్లు అవసరం. ఇవన్నీ ప్రైవేటు వెండర్స్ వద్ద రూ.50 నుంచి రూ.100 అదనంగా పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment