చంద్రగిరిలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా | - | Sakshi
Sakshi News home page

చంద్రగిరిలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

Published Sun, Feb 16 2025 1:36 AM | Last Updated on Sun, Feb 16 2025 1:36 AM

చంద్ర

చంద్రగిరిలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

● స్వర్ణముఖిలో పగటిపూట తవ్వకం.. రాత్రివేళ తరలింపు ● స్థానిక ప్రజాప్రతినిధి అండతో యథేచ్ఛగా సైఖతం

అధికారమే అండగా చంద్రగిరిలో నియోజకవర్గ ముఖ్య నేత రెచ్చిపోతున్నారు. స్వర్ణముఖి నదినే ఆదాయ వనరుగా మార్చుకుని హల్‌చల్‌ చేస్తున్నారు. ప్రైవేట్‌ సైన్యం ఏర్పాటు చేసుకుని మాఫియాను నడిపిస్తున్నారు. యథేచ్ఛగా ఇసుకను జేసీబీలతో తవ్వేసి అక్రమంగా తరలించేస్తున్నారు. ప్రశ్నించిన వారిని భయపెట్టి గొంతునొక్కేస్తున్నారు. అధికారులను గుప్పిట్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అడ్డు వచ్చిన సొంత పార్టీ నేతలను కూడా వేధింపులకు గురిచేస్తున్నారు. ఇసుక స్మగ్లింగ్‌లోకి దిగిన కేవలం రెండు నెలల్లోనే సుమారు రూ.4కోట్ల వరకు వెనకేసుకున్నట్లు ఆ పార్టీ వారే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.

పలు ప్రాంతాల్లో డంప్‌లు

ఇసుక మాఫియా నడిపిస్తున్న సదరు ముఖ్యనేత పలు ప్రాంతాల్లో ఇసుకను డంప్‌ చేయిస్తున్నట్లు ఆ పార్టీ నేతలే వెల్లడిస్తున్నారు. రెడ్డివారిపల్లి స్వర్ణముఖి నది వంతెన సమీపంలోని ఓ మామిడి తోట, మిట్టపాళెం వద్ద రోడ్డుకు ఆనుకుని రెండు డంపింగ్‌ పాయింట్లును ఏర్పాటు చేసుకుని కాసులు దండుకుంటున్నట్లు వివరిస్తున్నారు.

రెడ్డివారిపల్లె వద్ద స్వర్ణముఖి తీరంలో డంప్‌ చేసిన ఇసుక

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : ‘ఇసుక మాఫియా ఆగడాలు అరికడుతాం. మట్టి అక్రమ రవాణాను అడ్డుకుంటాం. బెల్టు షాపులు నివారిస్తాం..’ అంటూ నీతులు చెప్పే సీఎం చంద్రబాబు తన సొంత ఊర్లో పరిస్థితిని చక్కదిద్దలేకపోతున్నారు. నియోజకవర్గ ముఖ్యనేత కనుసన్నల్లో చంద్రగిరి సమీపంలోని స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలో ఇసుక మాఫియా చెలరేగిపోతున్నా అరికట్టలేకపోతున్నారు. ఇంట గెలిచి రచ్చగెలువు అన్న పెద్దల మాట ప్రకారం ఆయన తన ఊర్లోనే పరిస్థితిని చక్కదిద్దలేనప్పుడు ఇక రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని ప్రజలు చర్చించుకుంటున్నారు.

రెచ్చిపోతున్న ఇసుక తోడేళ్లు

రెడ్డివారిపల్లె సమీపంలోని వాగులో రెండు జేసీబీలతో ఇసుకను తోడేస్తున్నారు. పగలంతా వాహనాలు బయటకు రాకుండా జేసీబీల ద్వారా తవ్వి, తమకు అనుకూలమైన ప్రాంతాల్లో డంపు చేసుకుంటున్నట్లు సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. రాత్రుల్లో 12 యూనిట్ల సామర్థ్యం ఉన్న ఐదు టిప్పర్లు, మరో 10 ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారని వెల్లడిస్తున్నారు.

గంజాయి బ్యాచ్‌తో గస్తీ

ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఆ ముఖ్యనేత అండతో ఆయన బినామీలు ఓ ప్రత్యేకమైన గ్రూపును తయారు చేసుకున్నట్లు తెలిసింది. సుమారు 15 మంది వరకు గంజాయికి అలవాటు పడిన యువకులను స్వర్ణముఖి నది వద్ద గస్తీకి ఏర్పాటు చేసుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రుల్లో ఇసుకను తోడే సమయంలో ఎవరైనా అడ్డొస్తే ఆ గంజాయి బ్యాచ్‌ దౌర్జన్యానికి పాల్పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ మద్యం బాటిళ్లను పొలాల్లో పడేయడం, గంజాయి సేవించి కేకలు వేస్తుండడంతో రైతులు సైతం ఆందోళనకు లోనవుతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే గంజాయి బ్యాచ్‌ దారుణంగా దాడి చేస్తోందని వాపోతున్నారు.

అధికారుల ఉదాసీనత

రెడ్డివారిపల్లె సమీపంలోని స్వర్ణముఖి నది నుంచి రూ.కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. పోలీసుల కళ్లెదుటే భారీ వాహనాల్లో ఇసుక తరలిపోతున్నా అడ్డుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు సైతం చర్యలు తీసుకోకపోవడం వెనుక ముడుపులే కీలకపాత్ర పోషిస్తున్నాయని తెలుస్తోంది.

నెలకు రూ.2.07 కోట్ల ఆదాయం

ఒక టిప్పర్‌ లోడు 12 యూనిట్లు కాగా, యూనిట్‌ ధర రూ.1,500 నుంచి రూ.1800 వరకు వసూలు చేస్తున్నారు. ఒక ట్రాక్టర్‌ లోడ్‌ రూ.1,200 నుంచి రూ.1,500 వరకు తీసుకుంటున్నారు. స్వర్ణముఖిలో 10 ట్రాక్టర్లు, 5 టిప్పర్లలతో ఇసుక దందా సాగిస్తున్నారు. రోజుకు ఒక్కో ట్రాక్టర్‌ పది ట్రిప్పుల వరకు తరలిస్తున్నారు. 10 ట్రాక్టర్లలో మొత్తం 100 ట్రిప్పులు రవాణాకు రూ.1.5 లక్షల వరకు ఆర్జిస్తున్నారు. రోజుకు ఒక్కో టిప్పర్‌ 5 ట్రిప్పులుగా తరలిస్తున్నారు. 5 టిప్పర్లు కలిపి 25 ట్రిప్పులు రవాణాకు రూ.5.40 లక్షల వరకు అక్రమంగా సంపాదిస్తున్నారు. నెలవారీగా ట్రాక్టర్ల ద్వారా రూ.45 లక్షలు, టిప్పర్ల ద్వారా రూ.1.62కోట్లు వెనకేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన నెలకు సుమారు రూ. 2.07కోట్లకు పైగానే ఇసుక నుంచి పిండుకుంటున్నట్లు సమాచారం. ఇందులో కొంత భాగం ప్రజాప్రతినిధి, అధికారులకు వెళుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తుండడం గమనార్హం. ఒక్క చంద్రగిరి మండలంలోనే ఇసుక అక్రమ రవాణాలో నెలకు రూ.2కోట్లకు పైగా ఆదాయం రాగా.. ఇక నియోజకవర్గంలోని మిగిలిన మండలాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఇట్టే ఊహించవచ్చు.

ప్రజాప్రతినిధి అండతోనే!

అధికార పార్టీలోని వారిని కూడా ఆ ముఖ్యనేత టార్గెట్‌ చేస్తున్నట్లు ఆ పార్టీ నాయకులే ఆరోపిస్తున్నారు. ఆయనను కాదని ఇసుకను తరలిస్తే వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగుతున్నారని, దీన్ని బట్టి ఆయన ఏ స్థాయిలో అధికారులను తన చేతిలో పెట్టుకున్నారో అర్థమవుతోందని విమర్శిస్తున్నారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన తమను ఇప్పుడు టార్గెట్‌ చేయడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ నేత ఆగడాలపై సీఎం చంద్రబాబుకు సైతం పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. ఇసుకను తరలించి వాటాలు గుంజుకుంటున్నట్టు పెద్ద ఎత్తున చర్చసాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
చంద్రగిరిలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
1
1/3

చంద్రగిరిలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

చంద్రగిరిలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
2
2/3

చంద్రగిరిలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

చంద్రగిరిలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
3
3/3

చంద్రగిరిలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement