
మహిళా వర్సిటీకి మరో మణిహారం
● ఖేలో ఇండియా మల్టీ పర్పస్ ఇండోర్ హాల్ ● తిరుపతి ఎంపీ కృషితో రూ.4.5 కోట్లతో నిర్మాణం ● నేడు ప్రారంభించనున్న మంత్రి లోకేష్
తిరుపతి సిటీ: పద్మావతి మహిళా వర్సిటీ శిగలో మరో మణిహారం చేరింది. ఇండోర్ స్పోర్ట్స్ కోసం మల్టీ పర్పస్ ఇండో హాల్ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మహిళలు అకడమిక్ విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంలో ఖేలో ఇండియా స్కీమ్‌లో భాగంగా రూ.5.72 కోట్లతో మల్టీ పర్పస్ ఇండోర్ హాల్ అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంది.
అత్యాధునిక హంగులు
పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్మించిన మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో నాలుగు షెటిల్ బ్యాడ్మింటన్ కోర్డులు, ఒక హ్యాండ్ బాల్ కోర్టు, జిమ్నాస్టిక్ హాల్, టేబుల్ టెన్నిస్ హాల్, జూడో మ్యాట్, వెయిట్ లిఫ్టింగ్ వంటి క్రీడలకు సౌలభ్యంగా భవననిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.4.50 కోట్లు ఉండగా మహిళా వర్సిటీ రూ.1.22 కోట్లు సమకూర్చింది.
తిరుపతి ఎంపీ కృషితోనే!
తిరుపతి ఎంపీ ఎం.గురుమూర్తి కృషితో ఖేల్ ఇండియా స్కీమ్ ద్వారా మహిళా వర్సిటీలో మల్టీపర్పస్ ఇండోర్ హాల్ మంజూరైంది. ఇండోర్ హాల్ వర్సిటీలో ఏర్పాటు చేయాలని గతంలో పలు మార్లు వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థినులు ఎంపీకి విన్నవించారు. దీంతో 2021లో కేంద్ర ప్రభుత్వానికి ఇండోర్ హాల్ ఆవశ్యకతను తెలియజేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం రూ.4.50కోట్లు మంజూరు చేసింది.
నేడు మంత్రి చేతుల మీదుగా ప్రారంభం
మహిళా వర్సిటీలో మల్టీపర్పస్ ఇండోర్ హాల్‌ను బుధవారం విద్యా, ఐటీ శాఖ మంత్రి నారాలోకేష్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే వర్సిటీలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రారంభోత్సవానికి సిద్ధమైన ఇండోర్ హాల్ వద్ద సుందరీకరణ పనులను మంగళవారం అధికారులు శరవేగంగా పూర్తిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment