ఈఎస్‌ఐ ఆస్పత్రి అభివృద్ధికి కృషి
తిరుపతి తుడా : ఈఎస్‌ఐ ఆస్పత్రి అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. బుధవారం తిరుపతి ఈఎస్‌ఐ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అవుట్ పేషెంట్ బ్లాక్, అత్యవసర విభాగం, ఓపీ, రిజిస్ట్రేషన్, ఇతర విభాగాలను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అవుట్ పేషెంట్స్ 150 నుంచి 350 వరకు పెరగడం, ఇన్ పేషెంట్స్ 30 నుంచి 53 వరకు చేరడం సంతృప్తికరంగా ఉందన్నారు. ఈ క్రమంలోనే రూ.5 లక్షల తన సొంత నిధులు వెచ్చించి కిట్లు, వసతులు కల్పించిన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.శ్యాంబాబును సత్కరించారు. రాష్ట్రంలోని ఇతర ఆస్పత్రుల సిబ్బంది తిరుపతి ఈఎస్‌ఐని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సూపరింటెండెంట్ శ్యాంబాబు, సీఎస్‌ఆర్‌ఎంఓ ప్రసాద్ పాల్గొన్నారు.
మార్చి 10లోపు
డిగ్రీ సెమిస్టర్ ఫీజు చెల్లించాలి
తిరుపతి సిటీ : ఎస్వీయూ పరిధిలో డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్‌కు సంబంధించి ఫీజును మార్చి 10లోపు చెల్లించాల్సి ఉంటుందని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎం దామ్లానాయక్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ రూ.500 అపరాధ రుసుముతో మార్చి 17వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చని వెల్లడించారు. అలాగే గురువారం నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అందుబాటులో ఉంటుందని వివరించారు.ఈ మేరకు వర్సిటీ పరిధిలోని అన్ని కళాశాల ప్రిన్సిపాళ్లకు సమాచారం అందించినట్లు తెలిపారు.
మహిళా సాధికారతే లక్ష్యం
తిరుపతి సిటీ : మహిళా సాధికారతే లక్ష్యంగా పద్మావతి యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తామని వైస్ చాన్సలర్ వి.ఉమ తెలిపారు. బుధవారం ఈ మేరకు వీసీగా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. వర్సిటీతో 40 ఏళ్లపాటు సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు. ప్రతిష్టాత్మక విద్యాలయంలో నిపుణులు, సమర్థులైన అధ్యాపకులు ఉన్నారని వెల్లడించారు. బోధన, బోధనేతర సిబ్బంది సహకారంతో వర్సిటీని అంతర్జాతీయ స్థాయి తీసుకెళ్లేందుకు యత్నిస్తామని వివరించారు. అలాగే విద్యార్థి నులను నూతన పరిశోధనల దిశగా ప్రోత్సాహం అందిస్తామని, ఉపాధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. ఈ క్రమంలోనే అన్ని విభాగాల్లో అడ్మిషన్లు పెంచేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు. విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యతనిస్తామని వివరించారు. అనంతరం ఆమెకు రిజిస్ట్రార్ రజని, సిబ్బంది అభినందనలు తెలిపారు.
ఈఎస్‌ఐ ఆస్పత్రి అభివృద్ధికి కృషి
Comments
Please login to add a commentAdd a comment