ఆర్‌పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది సంయుక్తంగా ఆపరేషన్
అదుపులోకి ముగ్గురు నిందితులు
85 గ్రాముల బంగారం, మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం
తిరుపతి అర్బన్: తిరుపతి రైల్వేస్టేషన్ కేంద్రంగా చోరీలకు పాల్పడుతున్న వారిపై కొద్దిరోజులుగా ఆర్‌పీఎఫ్, జీఆర్పీ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టినట్లు ఆర్‌పీఎప్ సీఐ మధుసూదన్ వెల్లడించారు. గురువారం ఆయన జీఆర్పీ పోలీసులతో కలసి తిరుపతి రైల్వేస్టేషన్‌లో మీడియాతో మాట్లాడారు. చోరీలకు సంబంధించి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో సీసీ కెమెరాలను పరిశీలించడంతో పాటు తిరుపతిలోని అన్ని ప్లాట్‌ఫాంలపై దృష్టి సారించామన్నారు.
ఆంధ్రతో పాటు కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ముగ్గురు నిందితులను గురువారం తిరుపతి రైల్వేస్టేషన్‌లోనే అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారి నుంచి రూ.1.70 లక్షలు విలువజేసే 85 గ్రాముల బంగారం, రూ.16 వేలు విలువజేసే రెండు మొబైల్స్, రూ.1.90 లక్షలు విలువజేసే రెండు ల్యాప్‌టాప్‌లు.. మొత్తంగా రూ.3,76,000 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
నిందితుల పేర్లను మీడియాకు వెల్లడించలేదని, ఎందుకంటే వీరితో పాటు వీరి సన్నిహితులను పట్టుకునే ప్రయత్నాల్లో భాగంగానే పేర్లు తెలిజేయలేదన్నారు. ఆర్‌పీఎఫ్, జీఆర్పీ పోలీసులు తిరుపతి రైల్వే స్టేషన్‌పై ప్రత్యేక నిఘా పెట్టామని ఆయన వెల్లడించారు. దేశవిదేశాల నుంచి భక్తులు వచ్చిపోతున్న నేపథ్యంలో నిఘా మరింత పెంచామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment