● 23న గ్రూప్–2 మెయిన్స్ ● జిల్లాలో 13 కేంద్రాల్లో పరీక్షలు ● జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్
తిరుపతి అర్బన్: ఏపీపీఎస్సీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులతో కలసి పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాల మేరకు పరీక్షల నిర్వహణ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నెల 23న జిల్లాలోని 13 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు ఉంటుందని అయితే అభ్యర్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని చెప్పారు. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు ఉంటుందని అయితే అభ్యర్థులు మధ్యాహ్నం 1.30 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు. ఆ తర్వాత ఉదయం, మధ్యాహ్నం పరీక్షలకు కేవలం అదనంగా గ్రేస్ పీరియడ్ 15 నిమిషాలు మాత్రమే ఉంటుందన్నారు. ఈ అంశాన్ని ప్రతిఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని స్పష్టం చేశారు. పరీక్షలకు ఓవరాల్ ఇన్‌చార్జ్‌గా జాయింట్ కలెక్టర్ వ్యవహరిస్తారని చెప్పారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు పటిష్టంగా ఉంటుందని వివరించారు. ఆర్టీసీ బస్సు సౌకర్యం, విద్యుత్ అంతరాయం లేకుండా సంబంధిత శాఖల అధికారులు చూడాలని, తాగునీరు, టాయిలెట్స్ సక్రమంగా ఉండాలని, అభ్యర్థుల సౌకర్యార్థం సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్టీసీ వారు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీపీఎస్సీ అధికారులు, ముఖ్యపర్యవేక్షణ అధికారులు, ఇన్విజిలేటర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment