మహిళా రైతు సంఘాల బలోపేతమే లక్ష్యం
– డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శోభన్‌బాబు
తిరుపతి అర్బన్: మహిళా రైతు సంఘాలను (రైతు ఉత్పత్తిదారుల సంఘాలు)బలోపేతం చేద్దామని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ టీఎన్ శోభన్‌బాబు తెలిపారు. గురువారం తిరుపతిలోని డీఆర్‌డీఏ కార్యాలయంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు సంబంధించి జిల్లాస్థాయిలో శిక్షణా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 34 వేల పొదుపు సంఘాలు ఉన్నాయని.. ఒక్కో పొదుపు సంఘంలో పది మంది సభ్యుల చొప్పున జిల్లావ్యాప్తంగా సభ్యులు 3,40,000 మంది ఉన్నారన్నారు. అయితే అందులోని మహిళలు 15 నుంచి 20 మంది రైతు ఉత్పత్తిదారుల సంఘాల పేరుతో జిల్లాలో సుమారుగా 2700 సంఘాలను ఏర్పాటు చేసిన విషయాన్ని తెలియజేశారు. ఎన్‌ఆర్‌ఎల్‌ఎం(నేషనల్ రూరల్ లైవీల్ ఉడ్ మిషన్) నేతృత్వంలో సంఘాల బలోపేతానికి వారికి సాయం చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రధానంగా మహిళా రైతు సంఘాలకు సేద్యం చేయడానికి అవసరమైన పలు పరికరాలను సబ్సిడీతో ఇవ్వడంతో పాటు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను సాగుచేయడానికి వారిని ప్రోత్సహించడం జరుగుతుందని చెప్పారు. అనంతరం సహకారశాఖ జిల్లా అధికారి లక్ష్మీ మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో ఏర్పాటైన రైతు ఉత్పత్తిదారుల సంస్థలను రిజిస్ట్రేషన్ చేశామని వెల్లడించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ పి.ప్రభావతి, జీవనోపాధుల జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ధనుంజయరెడ్డి, ఏపీఎం ద్రాక్షాయణి, ట్రైనర్ విజయ్‌కుమార్, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు చెందిన సభ్యులు, లీడర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment