పరిహారం పెంచండి
రేణిగుంట(ఏర్పేడు): ఏర్పేడు– పూడి రైల్వే బైపాస్ మార్గానికి తీసుకున్న భూములకు పరిహారాన్ని పెంచాలని మండలంలోని ఎండీ పుత్తూరు, చుట్టుపక్కల రైతులు తిరుపతి ఎంపీ గురుమూర్తికి విన్నవించారు. పూడి– ఏర్పేడు మధ్య ప్రస్తుతం రైల్వే లైన్ సర్వే పనులు పూర్తయ్యాయని, రెవెన్యూ అధికారులు భూ పరిహారం విషయంలో పదేళ్ల కిందటి మార్కెట్ రేటును పరిగణనలోకి తీసుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత మార్కెట్ రేటు ఎకరం రూ.కోట్లలో ఉండగా రెవెన్యూ అధికారులు ప్రభుత్వ రేటు పది సంవత్సరాల కిందట గణాంకాలు తీసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైల్వే లైను వెంబడి ట్రాక్టర్లు, ఇతర వాహనాలు వెళ్లేందుకు అనువుగా పెద్ద కల్వర్టులను ఏర్పాటు చేయాలని విన్నవించారు. స్పందించిన ఎంపీ రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని తెలిపారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఉన్నారు.
తిరుపతి ఘటనపై నివేదిక పంపండి
తిరుపతి సిటీ: తిరుపతిలో ప్రజాప్రతినిధులపై జరిగిన దాడికి సంబంధించి నాలుగు వారాల్లోగా యాక్షన్ టేకెన్ రిపోర్టు సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఏహెచ్‌ఆర్‌సీ) ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర సీఎస్, డీజీపీకి లేఖాస్త్రం సంధించింది. తిరుపతిలో ఈనెల 3వ తేదీన జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికలో భాగంగా వైఎస్సాఆర్‌సీపీ కార్పొరేటర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వెళ్లుతున్న బస్సుపై దాడి చేసి ధ్వంసం చేశారని, కార్పొరేటర్లను భయభ్రాంతులకు గురిచేసి కిడ్నాప్ చేశారని, పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరిగిందని, మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగిందని తిరుపతి ఎంపీ గురుమూర్తి ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్సీ సంబంధిత ఘటనపై అధికారులను నివేదిక కోరింది.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో 30 కంపార్ట్‌మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 59,776 మంది స్వామివారిని దర్శించుకోగా 22,386 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.24 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment