కాలుష్య రహిత నగరమే లక్ష్యం
తిరుపతి మంగళం: ప్రపంచ నలుమూలల నుంచి శ్రీవారి దర్శనార్థం వచ్చే తిరుపతిని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుదామని జిల్లా రవాణాశాఖాధికారి(డీటీఓ) కొర్రపాటి మురళీమోహన్ కోరారు. మంగళంలోని తిరుపతి జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో గురువారం జిల్లాలోని వాహన కాలుష్య తనిఖీ కేంద్రాలకు సంబంధించిన యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పొల్యూషన్ టెస్టింగ్ సెంటర్ల వివరాలు, వాహన వివరాలను విధిగా వాహన పోర్టల్(వెబ్‌సైట్)లో తక్షణమే పొందుపరచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని మార్చి 10వ తేదీలోపు పూర్తి చేయాలని, లేనిపక్షంలో కాలుష్య తనిఖీ కేంద్రాల గుర్తింపును రద్దు చేస్తామన్నారు. ముఖ్యంగా జిల్లా నుంచి తిరుమల వచ్చే వాహనాలు నిర్దిష్టమైన వాహన కాలుష్య ప్రమాణాలను పాటించాలని సూచించారు. అలిపిరి ప్రాంతంలో తిరుమలకు వెళ్లే వాహనాల తనిఖీ చేసేందుకు మోటార్ వాహనాల తనిఖీ బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. కాలుష్యం ఎక్కువగా ఉన్న వాహనాలను తిరుమల కొండపైకి అనుమతించమని, కండీషన్‌లో లేని వాహనాలను తిప్పితే సీజ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో మోటార్ వాహనాల తనిఖీ అధికారులు సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు, చంద్రశేఖర్, పరిపాలన అధికారి శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్ చరణ్, చక్రవర్తి పాల్గొన్నారు.
మహిళా దొంగ అరెస్ట్
తిరుపతి క్రైమ్: నగరంలో ఆటోలో ప్రయాణించే వారి వద్ద చోరీలకు పాల్పడుతున్న మహిళా దొంగను క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు క్రైమ్ డీఎస్పీ శ్యాంసుందర్ తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు.. తెలంగాణ ఖమ్మం జిల్లాకు చెందిన సాకే స్వరూపరాణి అలియాస్ వెంకటలక్ష్మి (30) గత కొంతకాలంగా నగరంలో ఆటోల్లో ప్రయాణిస్తున్న వ్యక్తులను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడింది. లక్ష్మీపురం, ఎంఆర్ పల్లి సమీపంలో ఆటోల్లో ఇప్పటివరకు రూ.12 లక్షలు విలువచేసే 150 గ్రాములు బంగారు ఆభరణాలను చోరీ చేసిందన్నారు. ఈమెను తమ సిబ్బంది గురువారం హరే రామ హరే కృష్ణ రోడ్డులో అరెస్ట్ చేశారన్నారు. నిందితురాలి నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment