తిరుపతి సిటీ : వేతనాల కోసం ఆరు నెలలుగా అగచాట్లు పడుతున్నామని ఎస్వీయూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు జీతం వేస్తారో తెలియక నానా అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. ఇష్టారాజ్యంగా రెండు నెలలకు ఒకసారి వేతనాలు చెల్లిస్తూ తమతో ఆడుకుంటున్నారని మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు అందిస్తామని కూటమినేతలు ఊదరగొట్టి.. ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనవరి వేతనమే ఇప్పటి వరకు జమ చేయలేదని, దీంతో కుటుంబ పోషణ కూడా కష్టంగా మారిందని ఉద్యోగులు, పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వర్సిటీ నాన్ టీచింగ్ అసోషియేషన్ నేతలు శనివారం నిరసన తెలిపారు. అనంతరం రిజిస్ట్రార్ భూపతినాయుడుకు వినతిపత్రం అందంచారు. సంఘం అధ్యక్షుడు గుర్రంకొండ శ్రీధర్, కార్యదర్శి సుబ్రమణ్యం మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీలోపు వేతనాలు చెల్లించకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఆరునెలలుగా సకాలంలో జీతాల కోసం పలుమార్లు విన్నవించుకున్నా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. జనవరి జీతాలనే ఇప్పటివరకు చెల్లించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం, వర్సిటీ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ఎంతో మంది ఉద్యోగులు తమ కుటుంబ అవసరాలు తీర్చుకునేందుకు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 18 లోపు జీతాలు చెల్లించకపోతే, 19వ తేదీ నుంచి వర్సిటీ ఏడీ బిల్డింగ్ ఎదుట ఉదయం 10.30 నుంచి 11గంటలవరకు ప్రతి రోజూ నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment