హత్య కేసులో ఐదుగురి అరెస్ట్
వీరిలో ఇద్దరు రౌడీ షీటర్లు
వాకాడు: వివాహేతర సంబంధం హత్యకు దారి తీసిన ఘటన వాకాడు మండలం, దుగ్గరాజపట్నం సమీపంలో ఈ నెల 17న చోటుచేసుకుంది. ఈ మేరకు పోలీసులు నిందితులను బుధవారం అరెస్ట్ చేశారు. వాకాడు సీఐ హుస్సేబాషా విలేకరులతో మాట్లాడుతూ గూడూరు పట్టణం, శివాలయం ప్రాంతానికి చెందిన కొండా అనిత్‌కుమార్‌రెడ్డి (25)కు గూడూరులోని కనుపూరు శ్రీహరి అలియాస్ జెమిని అనే రౌడీ షీటర్ భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఈ విషయం శ్రీహరి దృష్టికి రావడంతో అనిత్‌రెడ్డిపై పగ పెంచుకున్నాడు. పట్టణంలోని మరో రౌడీ షీటర్ బాసం నరేష్ అలియాస్ చిన్నప్రేమ్, కోట మండలం, విశ్వనాథ అగ్రహారానికి చెందిన పేనాటి అలియాస్ పేర్నాటి చందు, గూడూరు చవటపాళెంకు చెందిన షేక్ కాలేషా, గూడూరు గాంధీనగర్‌కు చెందిన జావీదులతో కలసి అనిత్‌రెడ్డిని హత్య చేసేందుకు పథకం రూపొందించారు.
ఈ నేపథ్యంలో చిల్లకూరు చుట్టుగుంట సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న దాబాను కేంద్రంగా చేసుకున్నారు. అనిత్‌రెడ్డికి మద్యం పార్టీ ఉందని నమ్మించి గూడూరు హైవే రోడ్డు నుంచి దాబా వద్దకు తన స్నేహితులు స్కూటీపై తీసుకొచ్చారు. అక్కడ మద్యం సేవించిన అనంతరం ఐదుగురూ కలసి అనిత్‌రెడ్డిని కర్రలతో కొట్టి చంపేశారు. తర్వాత టిమ్మర్‌తో తల వెంట్రుకలు, మీసాలు తీసి ఆనవా ళ్లు గుర్తుపట్టని విధంగా చెరిపేశారు. ఆపై మృతదేహాన్ని కారు డిక్కీలో ఉంచుకుని దుగ్గరాజపట్నం సమీపంలోని పొలాల్లో పడేసి వెళ్లారు. స్థానికుల సమాచాంతో వాకాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
విచారణలో హత్య వెనుక వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించినట్టు సీఐ తెలిపారు. ఆ కోణంలో దర్యాప్తు చేపట్టి శ్రీహరి(జెమిని), నరేష్(చిన్నా ప్రేమ్)తోపాటు, పేనేటి చందు, షేక్ కాలేషా, షేక్ జావీదులను అరెస్టు చేసినట్టు వెల్లడించారు. వారిచ్చిన సమాచారం మేరకు గూడూరు నారాయణ ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలోని రోడ్డు వద్ద మిగిలిన ఇద్దర్నీ అరెస్టు చేశామన్నారు. అనంతరం ఐదుగురు నిందితులను కోర్టులో హాజరు పరచనున్నట్టు తెలిపారు. మొదటి ముద్దాయి శ్రీహరిపై గూడూరు 1వ పట్టణ స్టేషన్‌లో, రెండో ముద్దాయి షేక్ కాలేషాపై రూరల్ పోలీస్టేషన్‌లో 5 క్రిమినల్ కేసులు, రౌడీ షీట్లు ఉన్నట్లు సీఐ తెలిపారు. త్వరితగతిన కేసును ఛేదించిన గూడూరు డీఎస్పీ రమణ్‌కుమార్‌ని అభినందించారు. ఎస్‌ఐలు నాగబాబు, పవన్‌కుమార్, చిన బలరామయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment