నారాయణవనం: వృత్తి విద్యను అభ్యసిస్తున్న యువ ఇంజినీర్లు వినూత్న పరిశోధనలతోనే గుర్తింపును పొందుతారని పలువురు పేర్కొన్నారు. స్థానిక పుత్తూరు సిద్ధార్థ కళాశాలలో శుక్రవారం నేషనల్ లెవల్ టెక్నికల్ సింపోజియంను నిర్వహించారు. పలు ఇంజినీరింగ్ కళాశాలల నుంచి 1,200 మంది యువ ఇంజినీర్లు 400 పరిశోధనాత్మక పత్రాలను సమర్పించారు. బెంగళూరుకు చెందిన ఇన్‌ఫోసిస్ అడ్వాన్స్‌డ్ ఇంజినీరింగ్ గ్రూప్‌కు చెందిన చీఫ్ ఇంజినీర్ జోహర్ సింగ్, తిరుపతికి చెందిన ఇండో ఎంఐఎం లిమిటెడ్ హెచ్‌ఆర్ కిరణ్‌కుమార్ ముఖ్యఅతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంకేతిక పరిశోధనలతో నూతన ఆలోచనలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. కళాశాలల ప్రిన్సిపాళ్లు చంద్రశేఖర్‌రెడ్డి, జనార్దనరాజు మాట్లాడుతూ టెక్నికల్ ఇన్‌ఫోయిజంలను వేదికగా చేసుకుని యువ ఇంజినీర్లు తమ సాంకేతిక పరిజ్ఞాన్ని పెంచుకోవాలని తెలిపారు. పవర్ పాయింట్, పేపర్ ప్రజెంటేషన్‌లో మొదటి ముగ్గురు విజేతలకు జ్ఞాపికలను, సర్టిఫికెట్లతోపాటు నగదు బహుమతిని అందజేశారు. వివిద ఇంజినీరింగ్ కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు.
గదుల కేటాయింపునకు ప్రత్యేక యాప్
తిరుపతి కల్చరల్: గదుల శుభ్రత, కేటాయింపులకు ప్రత్యేక యాప్ తీసుకురానున్నట్టు టీటీడీ ఈఓ శ్యామలరావు తెలిపారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కల్పించే సౌకర్యాలు సంతృప్తికరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. శుక్రవారం టీటీడీ పరిపాలన భవనంలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ తిరుమలలోని పలు ప్రాంతాలు, కాటేజీలలో పరిశుభ్రతను పెంచేందుకు సిబ్బందికి ప్రత్యేకంగా యాప్‌పై అవగాహన కల్పించాలన్నారు. టీటీడీ వసతి గతుల కేటాయింపుపై సమగ్ర సమాచారం తెలిసేలా సిబ్బందికి యాప్ రూపొందించాలన్నారు. అదనపు ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరి, జేఈవో వి.వీరబ్రహ్మం, ఇన్‌చార్జ్ సీవీఎస్‌వో వి.హర్షవర్దన్‌రాజు, టీటీడీ సీఈ టీవీ.సత్యనారాయణ పాల్గొన్నారు.
అర్హులందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్లు
తిరుపతి అర్బన్: అర్హులందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని సివిల్ సప్లయ్ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. శుక్రవారం రాత్రి ఆయన తిరుపతి కృష్ణానగర్‌లో దీపం–2 పథకం ద్వారా ఉచిత గ్యాస్ రెండో సిలిండర్ బుకింగ్ చేసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రితోపాటు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్, తిరుపతి, చంద్రగిరి, కోడూరు ఎమ్మెల్యేలు, జనసేన నేతలు, అధికారులు హాజరయ్యారు. ఏప్రిల్ నుంచి జూలై వరకు రెండో సిలిండర్ బుకింగ్ చేసుకోవాలని ఆయన సూచించారు.
పరిశోధనలతోనే గుర్తింపు