
ఎరచ్రందనం కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలు
తిరుపతి లీగల్: అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి, ఎరచ్రందనం దుంగలను నరికి తరలిస్తున్న కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలు శిక్ష, ఒక్కొక్కరికీ రూ.6 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎరచ్రందనం కేసుల విచారణ ప్రత్యేక కోర్టు జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. కోర్టు కానిస్టేబుల్ శివకుమార్ కథనం.. 2020 జనవరి 24వ తేదీ తిరుపతి టాస్క్ ఫోర్స్ ఫారెస్ట్ సిబ్బంది కరకంబాడి అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో నిందితులు ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలం, ఓబులాపురానికి చెందిన సీ.వెంకటరమణ, కర్నూలుకు చెందిన పీ.మహబూబ్‌బాషా మరో ముగ్గురు కలిసి 103 కిలోల ఐదు ఎరచ్రందనం దుంగలను నరికి, తరలిస్తుండగా ఫారెస్ట్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. వీరిలో ఒకరు కేసు విచారణ దశలో మృతి చెందారు. మరొకరు కేసు విచారణకు హాజరు కాకపోవడంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం నిందితులు వెంకటరమణ, మహబూబ్ బాషా, వైఎస్‌ఆర్ జిల్లాకు చెందిన రవి పై కేసు విచారణ జరిగింది. నేరం వెంకటరమణ, మహబూబ్ బాషాపై రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికీ శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. రవిపై నేరం రుజువు కాకపోవడంతో అతనిపై కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
నారాయణవనం: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మరో వ్యక్తి గాయాలతో ఆస్పత్రి పాలైన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. మృతుని భార్య హంస ఫిర్యాదు మేరకు వివరాలు.. పుతూరు ఎన్‌జీవో కాలనీలో పెయింటర్ శివకుమార్(45) నివాసముంటున్నాడు. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో నారాయణవనం మండలం వైకుంఠపురంలోని స్నేహితుడు యువరాజ్‌ని కలిసేందుకు వెళ్లాడు. అర్ధరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో స్కూటర్‌పై మరో స్నేహితుడు జనార్దన్‌తో కలిసి వైకుంఠపురానికి బయలుదేరాడు. జాతీయ రహదారి నారాయణవనం బైపాస్ రోడ్డులో హైలెవల్ బ్రిడ్జికి చేరుకున్న వీరి స్కూటర్‌ను వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో బ్రిడ్జిపై నుంచి స్కూటర్ కిందకు పడిపోయింది. ఈ ప్రమాదంలో శివకుమార్ మృతి చెందగా జనార్దన్ గాయాలతో బయటపడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చస్తున్నట్టు ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు.
ఎనిమిది మందికి జరిమానా
తిరుపతి లీగల్: మద్యం తాగి తిరుపతిలో వాహనాలు నడుపుతున్న ఎనిమిది మందికి ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి నాల్గవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి గ్రంధి శ్రీనివాస్ శుక్రవారం తీర్పు చెప్పినట్టు కోర్టు సూపర్‌ండెంట్ ఎన్వీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతి ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించి మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్టు కోర్టు కానిస్టేబుల్ గిరిబాబు తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
బాలాయపల్లి(సైదాపురం) : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందిన ఘటన బాలాయపల్లి మండలం కోడంబేడులో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ గోపి కథనం.. కోటంబేడు గ్రామానికి చెందిన వెంకటరమణయ్య(50) కొద్ది రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. ఆయన మృతదేహాన్ని స్థానికులు శుక్రవారం కోడంబేడు సమీపంలో ఉన్న తెలుగు గంగ కాలువ సమీపంలో గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఎరచ్రందనం కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలు