
ఐటీడీపీ అరాచక శక్తులపై చర్యలు తీసుకోండి
– జెడ్పీటీసీ సభ్యురాలు నన్నం ప్రిస్కిల్లా
పెళ్లకూరు: కూటమి ప్రభుత్వం అండతో మానవ విలువలను విస్మరించి రాక్షసుల్లా ప్రవర్తిస్తున్న ఐటీడీపీ అరాచక శక్తులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని పెళ్లకూరు జెడ్పీటీసీ సభ్యురాలు నన్నం ప్రిస్కిల్లా డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వైఎస్సార్ సీపీ మహిళా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్‌కు చేరుకుని స్థానిక ఎస్‌ఐ నాగరాజును కలిసి ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై సోషల్ మీడియాలో ఐటీడీపీ చేస్తున్న అసభ్యకరమైన పోస్టులను ఖండిస్తూ నిందితులను వెంటనే శిక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న ఐటీడీపీ నిర్వాహకులకు కూడా అక్కాచెల్లెళ్లు ఉంటారని మహిళలను కించపరిచేలా వైఎస్సార్ కుటుంబ ప్రతిష్టను దిగజార్చేలా ప్రవర్తిస్తున్న వారిని వెంటనే శిక్షించాలన్నారు. ఐటీడీపీని వెనుకుండి నడిపిస్తున్న మంత్రి లోకేష్, హోంమంత్రి అనిత స్పందించి నిందితులను శిక్షించాలన్నారు. రాజ్యాంగ చట్టాలు దేశంలోని ప్రతి ఒక్కరికీ సమానమని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుధారాణి, ఎంపీటీసీ సభ్యులు సుజాత, సునీత, సర్పంచ్‌లు లక్ష్మి, కల్పన, చిత్ర, పార్టీ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు శైలజ, ఎంపీటీసీ మాజీ సభ్యులు శ్రీదేవి పాల్గొన్నారు.