
ఘనంగా భాష్యకారుల ఉత్సవం
తిరుమల: శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. 19 రోజుల పాటు ఈ ఉత్సవం జరుగనుంది. మే 2న భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు. భగవద్ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా మీమాంస గ్రంథానికి ‘శ్రీభాష్యం’ పేరుతో వ్యాఖ్యానం చేశారు. అందుకే భాష్యకారులుగా పేరొందారు. శ్రీరామానుజులవారు జన్మించిన అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది శ్రీవారి ఆలయంలో భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు. భాష్యకారుల ఉత్సవాల మొదటి రోజున బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో మొదటి గంట అనంతరం శ్రీ రామానుజులవారిని బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా జీయ్యంగార్లు దివ్యప్రబంధ గోష్టి చేపట్టారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, తిరుమల చిన్నజీయర్‌స్వామి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
మూడు వాహనాల ఢీ.. ఇద్దరికి గాయాలు
తిరుపతి రూరల్: నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారిలోని తిరుపతి రూరల్ మండలం వకుళామాత ఆలయం వద్ద బుధవారం మూడు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి నుంచి చంద్రగిరి వైపు ఓ ట్రాక్టర్ వెళుతోంది. ఆ ట్రాక్టర్‌ను వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొంది. ఆ వెనుకనే వస్తున్న కారు లారీని ఢీకొంది. ఈ ఘటనలో మూడు వాహనాలు దెబ్బతిన్నాయి. మోల్డింగ్ వేసేందుకు ఉపయోగించే మిల్లర్‌ను తీసుకువెళుతున్న ట్రాక్టర్ అడ్డదిడ్డంగా నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్పగాయాలు అయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తిరుపతి రూరల్ పోలీసులు తెలిపారు.
పరిశోధనలతోనే సమస్యలకు పరిష్కారం
తిరుపతి సిటీ: వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిశోధనలతోనే పరిష్కార మార్గం దొరకుతుందని ఎస్వీ వెటర్నరీ వర్సిటీ ఇన్‌చార్జి వీసీ జేవీ రమణ అభిప్రాయపడ్డారు. ఎన్జీరంగా వర్సిటీ ఎస్వీ అగ్రికల్చరల్ కళాశాల ఆధ్వర్యంలో బుధవారం పీజీ విద్యార్థులకు బ్రిడ్జింగ్ సైన్స్ సస్టయినబులిటీ అండ్ ఫుడ్ సెక్యూరిటీ అనే అంశంపై చేపట్టిన రెండు రోజుల జాతీయ సదస్సు బుధవారం ముగిసింది. ఇందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సమస్యలకు దీటైన పరిశోధనలు జరగాలన్నారు. విద్యార్థులు జాతీయ సదుస్సుల్లో పాల్గొనడం ద్వారా వివిధ రాష్ట్రాల విద్యార్థుల మధ్య పరిశోధన అంశాలపై చర్చ, సమాచార మార్పిడి జరుగుతుందన్నారు. అలాగే విజ్ఞానం పెంపొందుతుందని తెలిపారు. వర్సిటీ పీజీ డీన్ ఏవీ రమణ మాట్లాడుతూ జాతీయ సదస్సులో 617 మంది పీజీ విద్యార్థులు పరిశోధనా పత్రాలు సమర్పించారని తెలిపారు. అనంతరం వివిధ పరిశోధన అంశాలలో ప్రతిభ కనబరిచిన పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు జ్ఞాపికలు, ఽప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్ వి.సుమతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ డి.సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా భాష్యకారుల ఉత్సవం