
ఎత్తులు.. జిత్తులు
● నేడు కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ● ప్రజాస్వామ్యంపై నమ్మకంతో బరిలో దిగిన వైఎస్సార్ సీపీ ● అధికార బలంతో కూటమి సన్నద్ధం
కుప్పం రూరల్ : కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం నిర్వహించనుంది. రిటర్నింగ్ అధికారిగా ఆర్డీఓ శ్రీనివాసరాజు, అబ్జర్వర్‌గా జేసీ విద్యాధరిని నియమించింది. నేటితో పురపీఠం ఎవరిదనే ఉత్కంఠకు తెరపడనుంది.
ఎన్నిక ఇలా..
మున్సిపల్ చైర్మన్ సుధీర్ తన పదవికి రాజీనామా చేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. కుప్పంలో మొత్తం 25 మంది కౌన్సిలర్లు ఉన్నారు. సుధీర్ కౌన్సిలర్ పదవికి సైతం రాజీనామా చేయడంతో ప్రస్తుతం 26 మంది మాత్రమే కౌన్సిలర్లుగా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు, ఎమ్మెల్సీలు కంచెర్ల శ్రీకాంత్, భరత్‌కు మున్సిపల్ కౌన్సిల్‌లో ఓటు హక్కు ఉంది.. దీంతో సభ్యుల సంఖ్య 27కు చేరింది. ఇందులో చంద్రబాబు వచ్చే అవకాశాలు లేకపోవడంతో 26 మంది సభ్యులతోనే ఎన్నిక జరిగే అవకాశాలు ఉన్నాయి. 14 మంది అభ్యర్థులు ఎవరికి చేతులు ఎత్తి మద్దతు తెలిపితే వారే చైర్మన్ అవుతారు. ఈ ఎన్నిక ప్రక్రియకు అధికారులు కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలోని మీటింగ్ హాల్‌ను సిద్ధం చేశారు.
సమాయత్తమైన ఇరు పార్టీలు
2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 19, టీడీపీ 6 గెలుచుకున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నలుగురు కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు.ప్రస్తుతం గెలవాలంటే మరో నలుగురు అభ్యర్థుల అవసరం ఉంది. బలం కోసం వైఎస్సార్ సీపీ అభ్యర్థులను టీడీపీ ప్రలోభపెడుతోంది.
పదవి కోసం కుమ్ములాటలు!
ఆలూ లేదు.. చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్టు తయారైంది కుప్పం ము న్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి. వైఎస్సార్‌సీపీకి సంపూర్ణ బలం ఉండడంతో ఆ పార్టీకి విజయావకాశాలు నల్లేరుపై నడకేనని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే బలం లేకపోయినా.. బరితెగించి కుప్పం చైర్మన్ గిరిని తన్నుకు పోవాలని టీడీపీ పన్నాగాలు పన్నుతోంది. ఈ క్రమంలోనే 19, 20, 5 వార్డుల కౌన్సిలర్లు దామోదరం, సోమశేఖర్, సెల్వరాజు చైర్మన్ కుర్చీ కోసం పోటీపడుతున్నట్టు తెలుస్తోంది. శనివారం రాత్రి హొసూరు సమీపంలోని క్యాంప్‌లో టీడీపీ నేతల మధ్య వివాదం రేగి, కుమ్ములాటలకు దారితీసినట్టు సమాచారం.
వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థిగా హఫీజ్
వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా 9వ వార్డు కౌన్సిలర్ ఎస్‌డీ హఫీజ్ బరిలో దిగారు. ప్రత్యామ్నాయంగా 2వ వార్డు కౌన్సిలర్ ఆర్. మునిరాజును పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి రంగంలోకి దిగారు. కౌన్సిలర్లకు విప్ జారీ చేసే బాధ్యతను కౌన్సిలర్ ఆర్. మునిరాజుకు కట్టబెట్టారు.