
ఎస్వీయూ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్‌పై బదిలీ వేటు
తిరుపతి సిటీ: ఎస్వీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎం దామ్లానాయక్‌ను ఇంజినీరింగ్ విభాగానికి బదిలీ చేస్తూ రిజిస్ట్రార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారం రోజుల పాటు సెలవులో ఉన్న దామ్లానాయక్‌పై వేటు వేయడంపై సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. డిగ్రీ 2వ, 4వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్ల జారీలో జరిగిన గందరగోళంతోనే ఆయనపై వేటుపడిందనే చర్చ నడుతోంది. ప్రభుత్వ ఆన్‌లైన్ సంస్థ జ్ఞానభూమి పోర్టల్ సాంకేతిక లోపంతోనే హాల్‌టికెట్ల జారీలో తప్పులు దొర్లాయని, ఇది వర్సిటీ ఉద్యోగులకు సంబంధంలేని విషయమని ఉద్యోగులు వాపోతున్నారు. ఈ విషయాన్ని అధికారులు సైతం తేల్చి చెప్పారు. సెలవులో ఉన్న దామ్లానాయక్‌పై బదిలీ వేటు వేయడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కాలేదని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు
నూతన కంట్రోలర్‌గా రాజమాణిక్యం
ఎస్వీయూ ఇంజినీరింగ్ విభాగంలో డిప్యూటీ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ బీ.రాజమాణిక్యంను నూతన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా అధికారులు నియమించారు. వచ్చేనెల 3వ తేదీలోపు బాధ్యతలు తీసుకోవాలని పేర్కొన్నారు.