
మండల పరిషత్ ఆవరణలో స్థల పరిశీలన చేస్తున్న డీసీసీబీ అధికారులు
కుల్కచర్ల: పాంబండ ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తున్నట్లు దేవస్థానం ఆలయ చైర్మన్ రాములు, ఈఓ సుధాకర్ తెలిపారు. బుధవారం మండల పరిధిలోని బండవెల్కిచర్ల పాంబండ దేవాలయం వద్ద టెంకాయలు, తలనీలాల వేలం పాటలను నిర్వహించారు. ఉగాది సందర్భంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలలో టెంకాయలు అమ్ముకునేందుకు రూ.5 లక్షల 51వేలకు కుర్వ వెంకటయ్య అనే వ్యక్తి దక్కించుకున్నారు. బ్రహ్మోత్సవాలతో పాటు సంవత్సర కాలానికి గానూ తలనీలాల వేలం పాటను రూ. 2లక్షల 44వేలకు అంగులురు పోలేరు అనే వ్యక్తి సొంతం చేసుకున్నారు. ఏడాదిపాటు టెంకాయలు అమ్ముకునేందుకుగాను రూ. 5లక్షల 42వేలకు శివప్రసాద్ అనే వ్యక్తి హక్కులను పొందారు. కార్యక్రమంలో తాండురు భద్రేశ్వర స్వామి ఆలయ ఈఓ శేఖర్ గౌడ్, ఆలయ పాలకవర్గ సభ్యులు సంజీవ్, లక్ష్మయ్య, ఆలయ అర్చకులు పాండు శర్మ తదితరులు పాల్గొన్నారు.
ఖాతాదారులకు సేవలు మరింత చేరువ
డీసీసీబీ జిల్లా సీఈఓ శ్రీనివాస్
మోమిన్‌పేట: ఖాతాదారులకు సేవలు మరింత చేరువ చేసేందుకు నూతన బ్యాంకు భవన నిర్మాణం చేపట్టనున్నట్లు డీసీసీబీ జిల్లా సీఈఓ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నూతన బ్యాంకు భవన నిర్మాణం చేపట్టేందుకు స్థల పరిశీలన చేశారు. నాబార్డు ద్వారా బ్యాంకు నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు ఆయన తెలిపారు. స్థలం అప్పగించిన వెంటనే భవన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. మోమిన్‌పేట పీఏసీఎస్ నూతన భవనం, గోదాం నిర్మాణ పనులకు శంకుస్థాపనచేశామన్నారు.ఆదే విధంగా డీసీసీబీ నూతన భవన నిర్మాణ పనులు చేపట్టామన్నారు. స్వల్పకాల రుణాల వడ్డీలను వసూలు చేయాలన్నారు. దీర్ఘకాలిక రుణ వాయిదా బకాయిలను క్రమం తప్పకుండా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించా రు.ఆయన వెంట డీసీసీబీ, నాబార్డు అధికారులు,తహసీల్దార్ కిరణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
బాలిక కిడ్నాప్ కేసులో ముగ్గురిపై పోక్సో కేసు
కుల్కచర్ల: బాలికను అపహరించిన ఘటనలో ముగ్గురిపై పోక్సో కేసులు నమోదయ్యాయి. ఎస్‌ఐ గిరి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని ఇప్పాయిపల్లికి చెందిన బాలిక(17)ను ఈ నెల 20న రాంపూర్‌కు చెందిన షేక్ సర్వర్ అనే యువకుడు ప్రేమ పేరుతో అమ్మాయిని అపహరించాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కిడ్నాప్ చేసింది షేక్ సర్వర్ అని ఫిర్యాదు చేశారు. విచారణను చేపట్టిన పోలీసులు బుధవారం బాలికను అపహరించిన షేక్ సర్వర్‌ను, అతనికి సహకరించిన నంచర్ల మల్లేశ్, నూకపోతు మల్లేశ్‌లను పట్టుకుని వారిపై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితులను పరిగి సబ్ జైలుకు రిమాండ్ చేశారు. బాలికను సఖి సెంటర్‌కు తరలించామని పోలీసులు తెలిపారు.
మరో మూడు నామినేషన్లు
సాక్షి, సిటీబ్యూరో: మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానానికి బుధవారం ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. లింగిడి వెంకటేశ్వర్లు, ఎస్.విజయ్‌కుమార్, కాంటే సాయన్నలు తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలాకు అందజేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదని రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు.
ప్రచారంలో బిజీ..
హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జేఎన్టీయూ మాజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వినయ్ బాబును మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్ ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. బుధవారం నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాల్లో ప్రచా రం నిర్వహించారు.

పాంబండ దేవాలయంలో వేలం పాట నిర్వహిస్తున్న అధికారులు