సాగర్ రహదారిపై ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు
ఇబ్రహీంపట్నం రూరల్: అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నమ్మను చూడడానికి బాబాయ్‌తో కలసి బైక్‌పై వెళుతున్న విద్యార్థి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. మన్నెగూడ క్రాస్ రోడ్డులో బైక్ యూటర్న్ తీసుకుంటుండగా లారీ ఢీకొంది. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఆదిబట్ల పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ శేరిగూడ గ్రామానికి చెందిన శ్రీశైలం, సంతోష దంపతులు. వీరికి ఒకే ఒక్క కుమారుడు మధు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. ఇదే గ్రామంలో చిన్నమ్మ పద్మ, చిన్నాన్న బీరప్ప ఉంటారు. పొలానికి వెళ్లిన పద్మ అనారోగ్యానికి గురైంది. ఆమెను మన్నెగూడ సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు.
సాయంత్రం 4గంటల సమయంలో భార్య పద్మను చూడడానికి బీరప్ప బైక్‌పై మన్నెగూడకు బయలు దేరాడు. ఈ సమయంలో అన్న కుమారుడు మధు కూడా చిన్నమ్మను చూడడానికి బీరప్ప వెంట వెళ్లాడు. బైక్ మన్నెగూడ క్రాస్‌రోడ్డు వద్ద యూటర్న్ తీసుకుంటుండగా ఇబ్రహీంపట్నం వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మధు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న తల్లి, చిన్నమ్మ ఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు.
సాగర్ రహదారిపై ఆందోళన
విద్యార్థి మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు సాగర్ రహదారిపై రాస్తారోకో చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాత్రి 8 గంటల వరకు ఆందోళన జరగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మన్నెగూడ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమా మహేశ్వర్‌రావు, ఆదిబట్ల పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment