వికారాబాద్: పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నారా చంద్రబాబునాయుడి శిష్యుడేనని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు బీమా, రైతు బంధు పథకాలను ఎత్తేయడం ఖాయమని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చన్గోముల్‌లో చేవెళ్ల ఆరోగ్య రథాన్ని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య రథాన్ని ప్రారంభించామన్నారు.
ఆరోగ్య రథ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రేవంత్‌రెడ్డి రైతులకు మూడు గంటల కరెంట్ సరిపోతుందని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్‌లో ఉచిత విద్యుత్తు ప్రస్తావన లేదన్నారు. మూడు గంటలు ఇచ్చే కాంగ్రెస్ కావాలా.... మూడు పంటల బీఆర్‌ఎస్ కావాలా అనేది ప్రజలు తేల్చుకోవాలని అన్నారు. రాష్ట్రంలో రైతుల అవసరాల మేరకే విద్యుత్తు కొంటున్నామని అన్నారు.
పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం నిత్యం తపించే వ్యక్తి ఎంపీ రంజిత్‌రెడ్డి అని అన్నారు. సొంత డబ్బులతో ఆరోగ్య రథాన్ని ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లిక, ఎంపీపీ మల్లేశం, జెడ్పీటీసీ మేఘమాల, మార్కెట్‌కమిటీ చైర్మన్ అజారుద్దీన్, పార్టీ మండల అధ్యక్షుడు మైపాల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు రహీస్‌ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment