వికారాబాద్: ఎన్నికల ప్రచారానికి జెడ్పీ చైర్‌పర్సన్ సునితారెడ్డి దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీకి చెందిన ఆమె ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో కనిపించలేదు. బీఆర్‌ఎస్ అధిష్టానం జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి 15 రోజులు దాటింది. బరిలో నిలిచిన వారు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే జెడ్పీ చైర్‌పర్సన్ సునితారెడ్డి ఇప్పటి వరకే ఏ నియోజకవర్గంలో కూడా అభ్యర్థి తరఫున ప్రచారం చేయలేదు. గతంలో ఎమ్మెల్యేలతో తలెత్తిన వివాదాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీల్లోని చిన్న చిన్న కార్యకర్తలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యేలు సునితారెడ్డిని మాత్రం ప్రచారానికి పిలువలేదని ఆమె సన్నిహితులు అంటున్నారు.
పెరుగుతున్న గ్యాప్
ఏడాది క్రితం నుంచి ఎమ్మెల్యేలు, వారి వర్గీయులు జెడ్పీ చైర్‌పర్సన్ సునితారెడ్డితో అంటీముట్టనట్లు ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఆరు నెలల క్రితం మర్పల్లిలో ఆమె కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఈ ఘటనపై కలత చెందిన ఆమె ఎమ్మెల్యేలు, వారి వర్గీయులను దూరం పెడుతూ వచ్చారు. ప్రధానంగా వికారాబాద్, తాండూరు ఎమ్మెల్యేలతో ఏడాది కాలంగా గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఇదిలా ఉండగా అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల్లో ఒక వర్గం సునితారెడ్డికి అండగా నిలవగా, మరో వర్గం వ్యతిరేకంగా ఉంది. ఈ వర్గమే ఆమె కాన్వాయ్‌పై దాడికి యత్నించింది. ఈ గొడవలు ఎన్నికల నాటికి సద్దుమనుగుతాయని అనుకుంటే మరింత ముదిరి పాకాన పడుతున్నాయి. అయితే ఆమె వర్గంలోని మెజార్టీ నాయకులు ఇటీవల బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. అసమ్మతి నేతలను బుజ్జగించి, ఒక్క తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్న ఎంపీ రంజిత్‌రెడ్డి.. సునితారెడ్డి ప్రచారానికి దూరంగా ఉన్న విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం.
ఆ రెండు చోట్ల ప్రచారం చేసే అవకాశం
పరిగి ఎమ్మెల్యేతో జెడ్పీ చైర్‌పర్సన్‌కు పెద్దగా అభిప్రాయ బేధాలు లేకపోవడం, కొడంగల్ ఎమ్మెల్యే స్వయాన ఆమె మరిది కావటంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రచారం చేసే అవకాశం ఉన్నట్టు ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని ఆమె అధిష్టానం పెద్దలకు కూడా చెప్పినట్లు సమాచారం. అయితే సన్నిహితుల వద్ద మాత్రం అసలు విషయం చెబుతూ.. ఇతరులు ఎవరైనా అడిగితే మాత్రం తన ఆరోగ్యం సహకరించక పోవడం వల్లే ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నట్లు చెబుతూ వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment