అమ్మవారి పాటను ఆవిష్కరించిన కలెక్టర్
బొంరాస్‌పేట: జగజ్జనని పోలేపల్లి ఎల్లమ్మ ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజులు నిర్వహించే ఉత్సవంలో తొలి రోజు కోనేరు లో అమ్మవారి చక్రస్నానం నిర్వహించి డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాల నడుమ పల్లకీసేవ చేపట్టారు. ఉదయంనుంచే భక్తులు పెద్దఎత్తున హాజరై పూజలు చేశారు.
నేడే సిడె
జాతరలో ప్రధాన ఘట్టమైన సిడె ఉత్సవం శుక్రవారం సాయంత్రం జరగనుంది. సిడె అనే కొయ్యకు నిమ్మకాయలు, పూలతో అలంకరించిన ఊయల కడతారు. ఇందులో అందంగా అలంకరించిన అమ్మవారి ఉత్సవమూర్తిని ఉంచి ఆలయం చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తారు. ఈ సమయంలో భక్తులు అమ్మవారిపై గవ్వలు చల్లుతూ ఎల్లమ్మ తల్లి సల్లంగా చూడమ్మా అంటూ వేడుకుంటారు. ఈ కార్యక్రమానికి లక్షకు పైగా భక్తులు హాజరవుతారని అంచనా. ఇప్పటికే ఉత్సవాలకు తగిన ఏర్పాట్లు సిద్ధం చేశామని ఆలయకమిటీ చైర్మన్ జయరాములు, ఈఓ రాజేందర్‌రెడ్డి తెలిపారు.
ముఖ్యమంత్రి రాక
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం తన సొంత నియోజకవర్గంలోని పోలేపల్లి ఎల్లమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని ఎస్పీ నారాయణరెడ్డి వెల్లడించారు. డీఎస్పీలు, సీఐ, పలువురు ఎస్‌ఐలు, ఇతర కానిస్టేబుళ్లు, ప్రత్యేక బలగాలు జాతరలో మోహరించాయి.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ
జాతర ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలు, భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్, మల్టీజోన్ ఐజీ సత్యనారాయణ, ఎస్పీ నారాయణరెడ్డి, కడా అధికారి వెంకట్‌రెడ్డి పర్యవేక్షించారు.
ముగిసిన చక్రస్నానం, పల్లకీసేవ
నేడు ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు
భారీగా మోహరించిన పోలీసులు
కలెక్టర్, ఐజీ, ఎస్‌పీల పర్యవేక్షణ
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ చైర్మన్ జయరాములు రూపొందించిన పోలేపల్లి ఎల్లమ్మ దేవత పాటను కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆవిష్కరించారు. ‘ఎల్లు ఎల్లమ్మ రావే’.. అనే పాట భక్త జనాన్ని ఆకట్టుకుంటుందని రచయిత, గాయకుడిని కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ట్రెయినీ కలెక్టర్ ఉమాహారతి, సింగర్ నర్సింహ, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, మల్లేశ్, రాంచంద్రారెడ్డి, నర్సింలునాయుడు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment