క్రీడలకు ప్రభుత్వ ప్రోత్సాహం
● స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి
● శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్
అనంతగిరి: రాష్ట్ర ప్రభుత్వం క్రీడా పోటీలను నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వికారాబాద్‌లో 34వ సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి బాలబాలికల చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తోంది. గురువారం స్పీకర్ ప్రసాద్ కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు క్రీడలు, వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం పెంపొందుతుందన్నారు. ప్రతిభగల క్రీడాకారులకు తమ ప్రోత్సాహం ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ నెలకొల్పేందుకు పూనుకున్నారన్నారు. విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి హన్మంత్‌రావు, కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పరుశురాంనాయక్, ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్, ఉపాధ్యక్షుడు ఆనంద్, డీసీసీబీ డైరక్టర్ కిషన్‌నాయక్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మహిపాల్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు రత్నారెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్‌కుమార్, ఏఎంసీ మాజీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, మురళి, వెంకట్‌రెడ్డి, పీడీలు, పీఈటీలు, నాయకులు, యువజన నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment