● స్నానం చేసే క్రమంలో ప్రమాదం
● మృతుడు గోనూరువాసి
చేవెళ్ల: మండల కేంద్రంలోని శ్రీబాలాజీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ జాతరకు వచ్చిన ఓ భక్తుడు స్నానం చేసేందుకు పుష్కరిణిలో దిగి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గోనూరుకు చెందిన కురువ బిచ్చప్ప(45) కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. బతుకుదెరువు కోసం నాలుగేళ్ల కిత్రం భార్య శివలీల, కూతురుతో కలిసి అత్తగారి గ్రామమైన చేవెళ్ల మండలం కిష్టాపూర్ వచ్చాడు. ఇక్కడే కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. మంగళవారం చేవెళ్లలో జరుగుతున్న జాతరకు వెళ్దామని భార్యతో అన్నాడు. సాయంత్రం వెళ్దామని చెప్పిన ఆమె.. కూలీ పనికి వెళ్లింది. దీంతో బిచ్చప్ప ఒక్కడే చేవెళ్లకు చేరుకున్నాడు. స్నానం చేసేందుకు ఆలయ సమీపంలోని పుష్కరిణిలోకి దిగాడు. ప్రమాదవశాత్తు కాలు జారడంతో ఈత రాక నీటిలో మునిగిపోయాడు. అక్కడే ఉన్న పలువురు భక్తులు ఇది గమనించి బయటకు తీయగా, అప్పటికే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య శివలీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment