
ఒక భవనం..మూడు శాఖలు!
దుద్యాల్: చాలీచాలని వసతులతో ఆ చిన్నారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నాలుగు అక్షరాలు నేర్చుకొని ప్రయోజకులు అవుతారని ఆశపడ్డ వారి తల్లిదండ్రులకు గదుల సమస్య నీడలా వెంటాడుతోంది. మండలంలోని సంట్రకుంట తండాలో ఒకే భవనంలో ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, పంచాయతీ కార్యాలయం నిర్వహించడంతో విద్యార్థులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సరిపడా గదులు లేకపోవడమే సమస్యను మరింత జటిలం చేసింది. ఈ భవనంలో ఉన్న గదిలో ఉపాధ్యాయులు 20 చిన్నారులతో పాఠశాల నిర్వహిస్తుండగా, వరండాలో ఒక పక్క అంగన్‌వాడీ కేంద్రం, మరోపక్క గ్రామ పంచాయతీ కార్యాలయాలను కొనసాగిస్తున్నారు.
అంగన్‌వాడీలో బాలల అల్లరి
మూడు శాఖలకు సంబంధించిన కార్యకలాపాలు ఒకే భవనంలో జరుగుతుండడంతో చాలా ఇబ్బందిగా ఉందని విద్యార్థులతో పాటు తండావాసులు వాపోతున్నారు. తరగతులు జరిగేటప్పుడు అంగన్‌వాడీ బాలలు చేసే అల్లరితో ఇబ్బందులు తప్పడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీకి సంబంధించి ఏవైన పనులు సాగుతున్నప్పుడు గ్రామస్తులు వచ్చి పెద్దగా మాట్లాడుతుంటారు. దీంతో చదువుపై దృష్టి సారించలేకపోతున్నమని విద్యార్థులు మదన పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి వేరు వేరుగా కార్యకలాపాలు సాగేలా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని తండావాసులు కోరుతున్నారు.
భూమి పూజకు నోచుకోక...
ఒకే భవనంలో మూడు కార్యకలాపాలు సాగిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని గమనించి ప్రభుత్వం రూ.41 లక్షలతో పాఠశాల భవనాన్ని మంజూరు చేసింది. కానీ నెలలు గడుస్తున్నా నేటికీ భూమి పూజకు నోచుకోలేదు. అత్యవసరం ఉన్న చోటే నిర్మాణం త్వరగా చేపడితే అక్కడ పరిస్థితులు మారుతాయని ప్రజలు భావించినా ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుందని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు స్పందించి వచ్చే విద్యా సంవత్సరం వరకు భవనం అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
గదిలో పాఠశాల, వరండాలో అంగన్‌వాడీ, గ్రామ పంచాయతీ నిర్వహణ
సంట్రకుంట తండాలో అవస్థలు పడుతున్న విద్యార్థులు
పాఠాలు అర్థం కావడం లేదని గగ్గోలు
నూతన భవనం నిర్మించాలని విజ్ఞప్తి
Comments
Please login to add a commentAdd a comment