కొత్త కోటా | - | Sakshi
Sakshi News home page

కొత్త కోటా

Published Wed, Mar 5 2025 9:49 AM | Last Updated on Wed, Mar 5 2025 9:49 AM

కొత్త కోటా

కొత్త కోటా

కొత్త రేషన్‌ కార్డులకు ఎదురు చూస్తున్న పేదల నిరీక్షణ ఫలించింది. కొలువుదీరిన నాటి నుంచి నేడు.. రేపు అంటూ ఆశలు రేకిత్తించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కార్డులివ్వకున్నా బియ్యం విడుదల చేసింది. కాగా రేషన్‌ కార్డుల్లో పేర్లు చేర్చే విషయంలో ఇప్పటి వరకు ఇంకా ఏ నిర్ణయం తీసుకోవడం లేదు.

వికారాబాద్‌: గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయకుండా ఎన్నికలకు ఏడాదిన్నర ముందు దరఖాస్తు దారుల్లో సగం మందికి కార్డులిచ్చి చేతులు దులుపుకొంది. ఎనిమిదేళ్ల క్రితం ఆహార భద్రతా పథకంలో భాగంగా లబ్ధిదారులను ఎంపిక చేసింది. ఆ సమయంలో కుటుంబంలో ఉన్నవారి సంఖ్యను చేర్చింది. తదనంతరం కొందరు వివాహం చేసుకుని అత్తగారింటికి వచ్చినవారు, వారి సంతానం వేలల్లో ఉన్నారు. మరికొందరి పేర్లు సాంకేతిక కారణాలతో తొలగించబడ్డాయి. పెళ్లి అయినవారి, జన్మించిన వారి వివరాలను కార్డులో చేర్చేందుకు నాటి నుంచి మళ్లీ అవకాశం కల్పించలేదు. కాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డులు జారీ చేస్తున్న నేపథ్యంలో ఆహార భద్రత కార్డుల్లో కొత్తవారిని చేర్చాలని పేదలు కోరుతున్నారు.

35 వేల దరఖాస్తులు పెండింగ్‌

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో ఎనిమిదేళ్ల క్రితం ఆహారభద్రత లబ్ధిదారులను ఎంపిక చేసి ఆన్‌లైన్‌లో జాబితాను ఉంచింది. అనంతరం పూర్తిస్థాయి బయోమెట్రిక్‌ విధానం అమలు చేస్తోంది. కొత్త మెంబర్‌ను జాబితాలో చేర్చే విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వారికి ఎనిమిదేళ్లుగా ఎదురు చూపులు తప్పడం లేదు. జిల్లాలో ఇప్పటికే 35 వేల మంది దరఖాస్తులు చేసుకుని నేటికీ నిరీక్షిస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో కేంద్రం ఇచ్చే రేషన్‌కు దూరమవుతున్నారు.

ఈ నెల నుంచి పంపిణీ

ప్రజా పాలనలో రేషన్‌ కార్డుల కోసం 23,542 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీటిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి 22,404 మందిని అర్హులుగా గుర్తించారు. మిగిలిన 1, 138 దరఖాస్తులు వివిధ కారణాలతో తిరస్క రించారు. ప్రస్తుతం జిల్లాలో కొత్త వాటితో కలుపుకొని 2,63,573 రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఈనెల నుంచి జిల్లాలో 5,603 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నారు.

ఈ నెల నుంచి కొత్త రేషన్‌ కార్డులకు ఆహార భద్రత

రేషన్‌ దుకాణాలకు చేరిన 268 మెట్రిక్‌ టన్నుల బియ్యం

22,404 కుటుంబాలకు లబ్ధి

కొత్త పేర్ల నమోదుకు 35 వేల దరఖాస్తులు పెండింగ్‌

చౌక ధరల దుకాణాలు 588

ఆహారభద్రత కార్డులు 2,41,622

ఎఫ్‌ఎస్సీ కార్డులు 14,853

అంత్యోదయ కార్డులు 26,730

అన్నపూర్ణ కార్డులు 39

ప్రతీ నెల బియ్యం సరఫరా 5,335

మెట్రిక్‌ టన్నులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement