
పడకేసిన పశు బీమా
● పాడి రైతుకు కరువైన ధీమా ● పశువులు మృత్యువాతపడి నష్టపోతున్న దుస్థితి ● పథకం పునరుద్ధరించాలని వేడుకోలు
పరిగి: పాడి పశువులు ఏదైనా ప్రమాదం సంభవించి మృత్యువాత పడితే రైతులకు నష్టం వాటిళ్లకుండా పశుబీమా ఉండేది. ప్రస్తుతం పశుబీమా నిలిచిపోవడంతో పాడి రైతులు ఇబ్బంది పడుతున్నారు. పశుపెంపకం ఆధారపడిన వారు పశువులు విద్యుదాఘాతంతోనో, ఇతర అనారోగ్య సమస్యలతోనే చనిపోతే ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం మేలు రకం జాతిఆ పశువుల కొనుగోలుకు రూ.లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. ప్రమాదాలబారిన పడి పాడిపశువులు చనిపోతే రైతులు ఆర్థిక భారంతో కుదేలవుతున్నారు.
ఆరేళ్లుగా నిలిచిన పథకం
2017–18 వరకు పాడిపశువులకు బీమా పథకం అమలైంది. తదనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని పట్టించుకోవడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి వ్యవసాయం, పాడి పరిశ్రమే ప్రధాన ఆధారం. ప్రకృతి వైపరీత్యాలు, కరువు సమయంలో పాడి పశువులు ఎన్నో మృత్యువాత పడ్డాయి. దీంతో రూ.లక్షలు వెచ్చించి పశువులు కొనుగోలు చేసిన పాడి రైతులు బీమా సౌకర్యం లేక ఆర్థికంగా చతికిల పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఇప్పటికై నా పశుబీమా సౌకర్యం పునరుద్దరించాలని పాడి రైతులు కోరుతున్నారు.
40వేల లీటర్ల పాల ఉత్పత్తి
వ్యవసాయం చేస్తున్న ప్రతీ రైతు పాడి పశువులు సైతం సాకుతున్నారు. తక్కువ భూమి ఉన్న రైతులు పాడిరంగాన్ని ఎంచుకుని ఉపాధి పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 2,50,000 వేల పశువులుండగా ఆవులు 1,70,000, గేదెలు 80,000 ఉన్నాయి. 20 మండలాల్లో కలిపి సుమారు 40 వేల లీటర్ల పాలను రైతులు అందిస్తున్నారు. కానీ పాడినే నమ్ముకున్న రైతులకు బీమా సౌకర్యం లేక తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు.
ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం
ప్రస్తుతం పాడి పశువులకు ఎలాంటి బీమా సౌకర్యం అందుబాటులో లేదు. ఆరు సంవత్సరాలుగా ఈ ప్రక్రి య నిలిచిపోయింది. బీమా సౌకర్యం కల్పించాల ని ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందించాం. సర్కార్ నుంచి ఆదేశాలు వస్తే సమాచారం ఇస్తాం.
– సదానందం, జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి, వికారాబాద్
ఆర్థికంగా నష్టం
పశువులు మృత్యువాత పడితే తీవ్రంగా నష్టపోతున్నాం. గతంలో బీమా సౌకర్యం ఉండడంతో పశువులు చనిపోయినా కొంత డబ్బు అందేది. ఆ పథకం నిలిచిపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నాం. పాడి రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పశుబీమా సౌకర్యం కల్పించాలి.
– విష్ణువర్ధన్‌రెడ్డి, పాడి రైతు, దోమ
మూడు ఆవులు మృత్యువాత
నాలుగు ఆవులతో డెయిరీ ప్రారంభించా. మూడు నెలల క్రితం రెండు ఆవులు అనారోగ్యంతో మృత్యువాత పడ్డాయి. నాలుగు రోజుల క్రితం మరో ఆవు చనిపోయింది. దీంతో దాదాపు రూ.3.5 లక్షలు నష్టం వాటిల్లింది. బీమా సౌకర్యం కల్పిస్తే ఇంత ఇబ్బంది పడేవాడిని కాదు.
– రవికుమార్, మోత్కూరు, దోమ
Comments
Please login to add a commentAdd a comment