మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
జగద్గిరిగుట్ట: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వరంగల్ కు చెందిన రాజు (40) ఆస్ బెస్టాస్ కాలనీలో ఉంటూ సెంట్రింగ్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. కొంత కాలంగా మద్యానికి బానిసైన రాజు నెల రోజులుగా పనికి వెళ్లడం లేదు. గురువారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న అతను సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బిర్యానీ సెంటర్‌లో మంటలు
షాబాద్: ప్రమాదవశాత్తు ఓ హోటల్‌లో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నర్సింలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కన బిర్యానీ సెంటర్ నిర్వహిస్తున్నాడు. మధ్యాహ్నం ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్‌లో మంటలు చెలరేగాయి. గమనించిన యజమాని, చుట్టు పక్కల వారు నీరు పోసి మంటలార్పారు. అప్పటికే హోటల్‌లోని సామగ్రి కాలిబూడిదైంది.
హీరో నాగార్జున పరువునష్టం కేసు వాయిదా
● మంత్రి కొండా సురేఖ, హీరో నాగార్జున గైర్హాజరు
● విచారణ మార్చి 12కు వాయిదా
సిటీ కోర్టులు: రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసుపై గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు (స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్)లో విచారణ జరిగింది. ఈ విచారణకు పిటిషనర్ నాగార్జునతోపాటు ప్రతివాది మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడంతో వారి తరుఫున న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల కోర్టు విచారణను మార్చి 12కు వాయిదా వేసింది. సినీ అగ్రహీరో నాగార్జున కుమారుడైన హీరో నాగాచైతన్య–సమంత విడాకుల విషయంపై మంత్రి కొండా సురేఖ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారని, ఆమె చేసిన వ్యాఖ్యలతో తన కుటుంబ పరువుపోయిందని నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. తన కుటుంబంపై అసాధారణమైన వ్యాఖ్యలు చేసినందుకు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో మంత్రి కొండా సురేఖకు కోర్టు నోటీసులు జారీ చేయగా గత విచారణలో ఆమె వ్యక్తిగతంగా హాజరయ్యారు. దీంతో కొండా సురేఖ వ్యక్తిగత బాండ్‌తోపాటు రూ.10 వేలు పూచీకత్తు కోర్టులో దాఖలు చేయాలని కోర్టు సూచించింది. అయితే గురువారం జరిగిన విచారణకు ఆమె హాజరుకాకపోవడమే కాకుండా పూచీకత్తులు కూడా దాఖలు చేయలేదు. వచ్చే వాయిదా లోపు పూచీకత్తులు దాఖలు చేసుకోవాలని కొండ సురేఖ తరుఫు న్యాయవాదికి కోర్టు సూచిస్తూ విచారణను వాయిదా వేసింది.
దూరదర్శన్ మాజీ డైరెక్టర్
బాలకృష్ణ కన్నుమూత
లక్డీకాపూల్ : దూరదర్శన్ మాజీ డైరెక్టర్ దేవళ్ల.బాలకృష్ణ ( 92) గురువారం కన్నుమూశారు. హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం సంచాలకుడిగా పని చేయక ముందు ఆయన హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆయన మృతి పట్ల ఆకాశవాణి , దూరదర్శన్ కార్యక్రమ సిబ్బంది సంతాపం తెలిపారు. ఆకాశవాణి, దూరదర్శన్ అభివృద్ధికి బాలకృష్ణ చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. శుక్రవారం ఉదయం అంబర్‌పేట శ్మశానవాటికలో బాలకృష్ణ అంత్యక్రియులు నిర్వహించనున్నట్లు ఆయన బంధువు సాయి ప్రసాద్ పేర్కొన్నారు.
నేటి నుంచి
ఓపెన్ టెన్నిస్ టోర్నీ
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ (జేఐసీ)–హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్ (హోటా) ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో నేషనల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించనున్నారు. శుక్రవారం ఈ పోటీలకు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు జేఐసీ సెక్రెటరీ కిలారు రాజేశ్వర రావు తెలిపారు. జాతీయ స్థాయి హోటా, జేఐసీ నేషనల్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్ నగరంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ నెల 7 నుంచి 9 వరకు జరగనున్న ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 366 మంది టెన్నీస్ క్రీడాకారులు పాల్గొంటున్నట్లు తెలిపారు. 10 కేటగీరిల్లో సింగిల్స్, డబుల్స్ పోటీలకు 425 ఎంట్రీలు వచ్చాయన్నారు.
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment