
మహిళలను ప్రోత్సహిస్తే.. ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు
అనంతగిరి: మహిళలను ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిని, అర్జున అవార్డు గ్రహీత గుత్తా జ్వాల అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో టీజీఓ జిల్లా కమిటీ, మహిళా శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు హక్కులపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఉన్నత విద్యను అభ్యసించడంతోపాటు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని సూచించారు. అమ్మాయి, అబ్బాయి అనే తేడా లేకుండా చిన్ననాటి నుంచి ఆడపిల్లలను ప్రోత్సహించాలని అన్నారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. నా జీవితంలో మొదటి గురువు తన తల్లి అన్నారు. మహిళలను సమాన దృష్టితో చూడాలన్నారు. మగవారి విజయం వెనుక మహిళల సహకారం ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగంలో మహిళా ఉద్యోగులు వారికి అప్పజెప్పిన పనులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. విధుల పట్ల వారికున్న అంకితభావానికి గర్విస్తున్నానని పేర్కొన్నారు. బొంరాస్‌పేట ఆశ్రమ పాఠశాల మహిళా ఉపాధ్యాయులు చేసిన బంజార నృత్యం, భరత నాట్యం ఎంతగానో ఆకట్టుకుంది. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి, డీపీఓ జయసుధ, డీపీఆర్‌ఓ చెన్నమ్మ, సీడబ్ల్యూసీ చైర్మన్ వెంకటేష్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రక్తదాన శిబిరం
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి, వైస్ చైర్మన్ డాక్టర్ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కలెక్టరేట్, డీపీఆర్‌ఓ ఉద్యోగులు రక్తదానం చేశారు.
క్రీడా పోటీలు
మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా క్రీడాకారులకు, కలెక్టరేట్, మున్సిపల్, రెవెన్యూ, విద్య, వైద్య, పోలీస్ మహిళా సిబ్బంది, అంగన్‌వాడీ, మహిళా సంఘాల సభ్యులకు బహుమతులు అందజేశారు. కలెక్టరేట్‌లో రంగోలి, మ్యూజికల్ చైర్, చెస్ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు, రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు.
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిని గుత్తా జ్వాల
కలెక్టరేట్‌లో ఘనంగా మహిళా దినోత్సవం

మహిళలను ప్రోత్సహిస్తే.. ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు

మహిళలను ప్రోత్సహిస్తే.. ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు
Comments
Please login to add a commentAdd a comment