
వనితా.. వందనం
తల్లిగా బిడ్డను కంటికి రెప్పలా కాపాడుతోంది.. మమతానురాగాలకు చిరునామాగా నిలుస్తోంది.. తోబుట్టువుగా ప్రేమను పంచుతోంది.. ఆలిగా మగవాడి బతుకులో సగపాలు తనదిగా కష్టసుఖాల్లో తోడూనీడగా ఉంటోంది.. ప్రతి పురుషుడి విజయం వెనుక ‘ఆమె’ కీలకపాత్ర పోషిస్తోంది.. ఇంటికి దీపం ఇల్లాలుగా కుటుంబానికి వెలుగులు పంచుతోంది.. సేవకు ప్రతిరూపంగా నిలుస్తోంది.. ఒకవైపు వంటింట్లో గరిటెతిప్పుతూనే మరోవైపు రాజకీయాలు, పాలనలోనూ ‘చక్రం’ తిప్పుతోంది.. ఒకప్పుడు గృహిణులుగానే పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లో ‘రాణి’స్తున్నారు.. ఆకాశంలో సగం కాదు అన్నింట్లోనూ ముందే అని నిరూపిస్తున్నారు.. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు..
శంకర్‌పల్లి: పుట్టుకతో అంగవైకల్యం ఉన్నప్పటికీ డాక్టర్ కావాలనుకునే లక్ష్యాన్ని సాధించానని అంటున్నారు శంకర్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ రేవతిరెడ్డి. అమ్మానాన్నలు రేయింబవళ్లు కష్టపడ్డారని.. తాను, తన అక్క కలలు కన్న లక్ష్యాల కోసం నిరంతరం తాపత్రయ పడ్డారని చెబుతున్నారు. ఫీజు కట్టడానికి డబ్బుల్లేక నమ్ముకున్న పొలం సైతం అమ్మేసి చదివించారని తెలిపారు.
చదువులో చురుగ్గా..
వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలం దేవరంపల్లి గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డి, సరళ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు మాధవి రెడ్డి, చిన్న కూతురు రేవతి రెడ్డి. వెంకట్‌రెడ్డి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించాడు. చిన్న కూతురు రేవతిరెడ్డికి చిన్నతనం నుంచే అంగవైకల్యం ఉన్నప్పటికీ చదువులో చురుగ్గా ఉండేది. గమనించిన తండ్రి ఆమెను వెన్నుతట్టి ప్రోత్సహించాడు. శంకర్‌పల్లి పట్టణంలోని శ్రీ వివేకానంద పాఠశాలలో 7వ తరగతి వరకు తర్వాత 10వ తరగతి వరకు వికారాబాద్ ఎన్నేపల్లిలోని సంఘం లక్ష్మీబాయి రెసిడెన్షియల్ పాఠశాలలో, తర్వాత ఇంటర్ వరంగల్ హసన్‌పర్తిలోని ఏపీఆర్‌జేసీలో చదువుకుంది. ఎంబీబీఎస్‌లో దివ్యాంగుల కోటాలో సీటు రాకపోవడంతో ఓపేన్ ఎ క్యాటగిరీలో నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలోని కామినేని మెడికల్ కాలేజీలో సీటు సాధించింది.
ఖర్చుల కోసం పొలం అమ్మేసి
కూతురికి ఎంబీబీఎస్‌లో సీటు రావడంతో తండ్రి ఎంతో సంతోషించాడు. ఎంత కష్టమైనా చదవించాలనుకున్నాడు. పెద్ద కూతురు ఎంఎస్సీ, చిన్న కూతురు ఎంబీబీఎస్ కోసం సంవత్సరానికి రూ.లక్షల్లో ఖర్చవుతుండడంతో ఊర్లోని ఆరు ఎకరాల పొలం అమ్మి చదివించాడు. 2008లో పెద్ద కూతురు మాధవిరెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించగా.. 2014లో రేవతిరెడ్డి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. 2014 నుంచి 15 వరకు కోస్గి, 2015–18 నవాబ్‌పేట్, ప్రస్తుతం శంకర్‌పల్లి పీహెచ్‌సీల్లో వైద్యురాలిగా సేవలందిస్తోంది.
ప్రభుత్వం నుంచి అవార్డులు
రేవతిరెడ్డి ఆస్పత్రికి వచ్చే నిరుపేదలకు బాసటగా నిలుస్తోంది. అనేకమందికి ప్రాథమిక దశలోనే రుగ్మతలను గుర్తించి మెరుగైన వైద్యం అందించడమే కాకుండా, నిరంతరం పర్యవేక్షిస్తోంది. నిత్యం ఆస్పత్రికి వచ్చే గర్భిణులకు సాధారణ ప్రసవం గురించి, ఇంట్లో చేయాల్సిన వ్యాయామాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. రేవతిరెడ్డి చేస్తున్న వైద్య సేవలను గుర్తించి 2023లో కలెక్టర్ ఉత్తమ వైద్యురాలి అవార్డుకి ఎంపిక చేశారు. జిల్లా వైద్యా, ఆరోగ్య శాఖ వారు సాధారణ ప్రసవాలు, ఉత్తమ సేవలకు గాను రెండు సార్లు అవార్డులు అందించారు. డాక్టర్ రేవతిరెడ్డికి 2017లో పాండురంగారెడ్డి అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఆరేళ్ల పాప, మూడేళ్ల బాబు ఉన్నాడు. తండ్రి వెంకట్‌రెడ్డి 2020లో గుండెపోటుతో మృతి చెందాడు. అప్పటి నుంచి రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న తల్లి సంరక్షణను అక్కాచెల్లెళ్లు చూసుకుంటున్నారు.
● తగ్గేదేలె
తాండూరు టౌన్: తాండూరు పట్టణానికి చెందిన సంతోషి కుమారి గృహిణి. నవనీత ఓ ప్రైవేటు స్కూల్‌లో పీఈటీగా పనిచేస్తోంది. వీరు చిన్నతనంలో నేర్చుకున్న ఆటల్ని, ఇష్టాన్ని వదులుకోలేక పో యారు. ఈ ఏడాది జనవరి నెల 4, 5 తేదీల్లో హైదరాబాద్‌లో మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో 45 – 50 ఏళ్ల విభాగంలో 48 ఏళ్ల వయసున్న సంతోషి లాంగ్‌జంప్, ట్రిపుల్ జంప్‌లలో రెండు గోల్డ్ మెడల్స్ సాధించింది. నవనీత 35–40 ఏళ్ల విభాగంలో హైజంప్‌లో గోల్డ్ మెడల్, లాంగ్ జంప్‌లో సిల్వర్ మెడల్, ట్రిపుల్ జంప్‌లో సిల్వర్ మెడల్ సాధించింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు కేరళ రాష్ట్రం త్రిశూర్‌లో జరిగిన జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో సంతోషి ట్రిపుల్ జంప్‌లో బ్రాంజ్ మెడల్ సాధించగా, నవనీత హైజంప్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. త్వరలో ఇండోనేషియాలో జరగనున్న అంతర్జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో నవనీత పాల్గొననున్నారు.
● వైద్య వృత్తిలో..
దోమ: పేద ప్రజలకు వైద్యం అందించాలనే డాక్టర్ వృత్తిని ఎంచుకున్నా. నాన్న గోపాల్, అమ్మ సామ్రాజ్యం. వారికి ముగ్గురు సంతానం. తనను ఉన్నత ఉద్యోగంలో చూడాలన్నదే తల్లిదండ్రుల ఆకాంక్ష. సొంత జిల్లా నల్లగొండలో విద్యాభ్యాసం పూర్తి చేశా. మేడ్చల్‌లోని మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉద్యోగం సాధించా. మొదటి దోమ పీఎచ్‌సీకి పోస్టింగ్ ఇవ్వడం సంతోషంగా ఉంది.
● బతుకుదెరువు కోసం వెళ్లి.. ఎస్‌ఐ పోస్టు సాధించి
కుల్కచర్ల: మండలంలోని సక్య్రానాయక్ తండాకు చెందిన పాత్లావత్ అనూషాది పేద కుటుంబం. బండవెల్కిచర్ల గ్రామంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి.. షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. తల్లిదండ్రులకు చదివించే స్తోమత లేక మండలంలోని జీతుల తండాకు చెందిన పాత్లావత్ వెంకటేష్‌తో వివాహం చేసి పంపారు. వివాహ అనంతరం కూడా ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. దీంతో బతుకుదెరువు కోసం కుటుంబంతో హైదరాబాద్‌కు వెళ్లారు. తమ జీవితాలు బాగుపడాలంటే చదువు ఒక్కటే మార్గమని భావించింది. ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసింది. 2023 పోలీసు శాఖ రిక్రూట్‌మెంట్‌లో ఎస్‌ఐగా ఎంపికై ంది. ప్రస్తుతం నగరంలోని సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ట్రైనీ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తోంది. కష్టాలకు భయపడకుండా ముందుకు సాగితే విజయం తప్పక వరిస్తుందని నేటి యువతకు సందేశమిస్తోంది.
● ఆరుగురూ ప్రభుత్వ ఉద్యోగులే..
యాలాల: మండల కేంద్రానికి చెందిన సీహెచ్ హన్మయ్య విశ్రాంత ఉపాధ్యాయుడు. హన్మయ్య, సూర్యకళ దంపతులకు ఆరుగురు కూతుళ్లు. అందర్నీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించారు. సమాజంలో మహిళలకు ఎదురయ్యే అవాంతరాలు.. చదువు ప్రాముఖ్యతను తెలియజేస్తూ పెంచారు. ప్రస్తుతం ఆరుగురూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. సంధ్యారాణి(స్కూల్ అసిస్టెంట్), స్వరూపారాణి(గురుకుల ఉపాధ్యాయురాలు), భార్గవి(పీఆర్ ఏఈ, మహబూబ్‌నగర్ జిల్లా), అర్చన(పంచాయతీ కార్యదర్శి), అశ్విని(ఎస్జీటీ ఉపాధ్యాయురాలు), హారిక ఎస్జీటీ ఉపాధ్యాయురాలుగా స్థిరపడ్డారు.
వైకల్యాన్ని జయించి..
వైద్యురాలిగా
చట్టాల గురించి తెలుసుకోవాలి
మహిళలు దేశ అత్యున్నత పదవులను సైతం సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. మహిళా ప్రజాప్రతి
నిధులు భర్తల సాయం లేకుండా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆఫీసులకు స్వేచ్ఛగా, నిర్భయంగా వెళ్లిన నాడే నిజమైన హక్కులు సాధించుకున్నట్లు లెక్క. చట్టాల గురించి తెలుసుకోవాలి. అప్పుడే హక్కులు సాధించుకోగలుగుతారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
– డీబీ శీతల్, న్యాయమూర్తి, వికారాబాద్ కోర్టు
కుటుంబం నుంచే
స్వేచ్ఛ ప్రారంభం కావాలి
మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, స్వేచ్ఛగా వ్యవహరించినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు నా భావన. మహిళలకు స్వేచ్ఛ కుటుంబం నుంచే ప్రారంభం కావాలి. తల్లిదండ్రులు ఆడపిల్లలను మగపిల్లలను వేర్వేరుగా చూడటం మానేయాలి. ఆడపిల్లలను భారంగా భావించి చిన్నతనంలోనే పెళ్లి చేపి పంపుతున్నారు. ఇది చట్టవిరుద్ధం. బాలికలు బాగా చదివి ఉన్నత శిఖరాలు చేరాలి. ఆర్థికంగా స్థిరపడాలి. – జయసుధ, డీపీఓ
మహిళల్లో అక్షరాస్యత పెరగాలి
మహిళల్లో అక్షరాస్యతా శాతం పెరగాలి. తమ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఆరోగ్యం కాపాడుకోవాలి. మానసికంగా ధృడంగా ఉండాలి. జిల్లాలో మహిళా అక్షరాస్యత తక్కువే. బాల్య వివాహాలు కూడా ఎక్కువగా జరుగుతున్నట్లు సమాచారం ఉంది. వాటిని అరికట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఆడపిల్లలకు స్వేచ్ఛనివ్వాలి. వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రోత్సహించాలి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. – రేణుకాదేవి, డీఈఓ
ఓడిపోయిన వైకల్యం
అనంతగిరి: వికారాబాద్‌లోని ఆర్‌డీఓ కార్యాలయంలో డీఏఓగా విధులు నిర్వహిస్తున్న గోవిందమ్మ దివ్యాంగురాలు.. పుట్టినిల్లు వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గిరిగేట్‌పల్లి గ్రామం. అత్తారిల్లు కుల్కచర్ల మండలం ఘనాపూర్. చిన్నప్పుడే పోలియో బారిన పడింది. కానీ అధైర్య పడలేదు. హైదరాబాద్‌లోని వికలాంగుల స్కూల్‌లో చదువుకుంది. 2002లో జూనియర్ అసిస్టెంట్‌గా రెవెన్యూ శాఖలో ఉద్యోగం సాధించి రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ కార్యాలయంలో టైపిస్టుగా జాయిన్ అయ్యింది. ప్రమోషన్‌పై పరిగి గిర్దావర్‌గా, దోమలో డీటీగా, తహసీల్దార్‌గా యాలాలలో పనిచేసి ప్రస్తుతం ఆర్‌డీఓ కార్యాలయంలో డీఏఓగా బాధ్యతలు నిర్వహిస్తోంది. చదువుకు పేదరికం, అంగవైకల్యం అడ్డుకాదని చెబుతోంది. మనం కష్టపడి ముందుకు సాగితే విజయం తప్పకుండా వరిస్తుందని అంటోంది. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని యువతకు సూచిస్తోంది.
అధికారులను నిర్భందించి.. రోడ్డు సాధించి
బొంరాస్‌పేట: మహిళా సంఘాలు అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఎన్కేపల్లి గ్రామం. 2002కు ముందు గ్రామానికి మట్టి రోడ్డు కూడా లేదు.. అప్పట్లో ఓ ముస్లిం మహిళ చనిపోతే శవాన్ని మంచం మీద మోసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. ఈ ఘటన చూసిన గ్రామ మహిళా సంఘాలు చెలించిపోయాయి. ఆ సమయంలో జన్మభూమి కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన అధికారులను మహిళా సంఘాల సభ్యులు నిర్భందించారు. రోడ్డు సౌకర్యం కల్పించేదాకా అధికారులను వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. సాయంత్రం ఆర్డీఓ అనితారాంచంద్రన్ (ప్రస్తుత టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి) గ్రామానికి వచ్చి ప్రజలకు రోడ్డు హామీ ఇచ్చి అధికారులను తీసుకెళ్లారు. అనంతరం గ్రామానికి బీటీ రోడ్డు సౌకర్యం ఏర్పడింది. అప్పట్లో తాము ఉద్యమించడం వల్లే గ్రామానికి రోడ్డు, బస్సు సౌకర్యం వచ్చిందని మహిళా సంఘం అధ్యక్షురాలు బోయిని మాణెమ్మ తెలిపారు.
తనకంటూ ఓ పేజీ..
దుద్యాల్: మండలంలోని హస్నాబాద్‌కు చెందిన కంతి లక్ష్మి గతంలో మహిళా సంఘాల్లో పని చేసేది. భర్త కంతి సైదప్ప. గ్రామ పంచాయతీ కార్మికుడిగా పని చేసేవాడు. ప్రమాదంలో సైదప్ప కాలు విరిగిపోవడంతో భార్య లక్ష్మి 2020లో ఆయన విధుల్లో చేరింది. నాటి నుంచే పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజలకు తడి పొడి చెత్త గురించి వివరించడం మొదలు పెట్టింది. జనంలో కూడా మార్పు తెచ్చింది. ఆమె సేవలను అధికారులు గుర్తించారు. 2023లో జాతీయ స్థాయి ఉత్తమ పారిశుద్ధ్య కార్మికురాలుగా ఎంపిక చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకుంది. 2024లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన స్వచ్ఛత శక్తి పుస్తకంలో (61వ పేజీలో) చోటు దక్కించుకుంది.

వనితా.. వందనం

వనితా.. వందనం

వనితా.. వందనం

వనితా.. వందనం

వనితా.. వందనం

వనితా.. వందనం

వనితా.. వందనం

వనితా.. వందనం

వనితా.. వందనం

వనితా.. వందనం

వనితా.. వందనం

వనితా.. వందనం

వనితా.. వందనం
Comments
Please login to add a commentAdd a comment