నిర్మాణానికి టెండర్లు
సమీకృత గురుకులాల
కొడంగల్: మున్సిపల్ పరిధి పాత కొడంగల్ శివారులో సమీకృత గురుకులాల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు టెండర్లను ఆహ్వానించినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. కుల మతాలకు అతీతంగా అన్ని గురుకుల పాఠశాలలను ఒకే చోట నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యా వ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలుండగా తొలి విడతలో 55 నియోజకవర్గాల్లో గురుకుల భవనాలను నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు ప్రభుత్వం రూ.11 వేల కోట్లను మంజూరు చేసింది. ఇప్పటికే కొడంగల్, మధిర, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో గురుకులాల నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలన్నీ ఒకే ప్రాంగణంలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. పాత కొడంగల్ శివారులోని 20 ఎకరాల ప్రభుత్వ స్థలంలో అధునాతనమైన భవనాలను నిర్మించడానికి అధికారులు టెండర్లను పిలిచారు. 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఉచిత వసతితో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో గురుకులాలను నిర్మించనున్నారు. తరగతి గదుల్లో డిజిటల్ స్మార్ట్ బోర్డులు, కంప్యూటర్ సెంటర్లు, లైబ్రరీలను ఏర్పాటు చేస్తారు. కుల మత వర్గ అంతరాలు లేని విద్యా సౌధంలో క్రీడలను ప్రోత్సహించేలా క్రికెట్, పుట్‌బాల్ గ్రౌండ్స్‌తో పాటు బాస్కెట్ బాల్, టెన్నిస్ కోర్టులను ఏర్పాటు చేసి విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల్లో రాణించేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కొడంగల్‌లో ప్రత్యేక చొరవతో పనులు చేయనున్నారు.
విద్యకు తొలి ప్రాధాన్యం
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంజూరు చేశారు. రూ.11 వేల కోట్ల నిధులను వెచ్చించి ఏడాది లోపు పనులను పూర్తి చేయడానికి ప్రభుత్వం కషి చేస్తోంది. కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంతో ఈ ప్రాంతంలో విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎడ్యూకేషన్ హబ్‌గా మార్చడానికి అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మెడికల్ కళాశాల, వృత్తి విద్యా కళాశాల, వెటర్నరీ యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కళాశాల, నర్సింగ్ కళాశాల, ఫిజియోథెరపీ కళాశాల, పారా మెడికల్ కళాశాల, స్కిల్ యూనివర్సిటీ, వ్యవసాయ పరిశోధనా కేంద్రం, మహిళా డిగ్రీ కళాశాల, పీజీ కళాశాల, జూనియర్ కళాశాలలను మంజూరు చేశారు.
ఒకే ప్రాంగణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్స్
నాలుగు నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్య
పాత కొడంగల్ శివారులో 20 ఎకరాలు కేటాయింపు
నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment