
కుక్కల దాడిలో జింక మృతి
అనంతగిరి: వికారాబాద్‌కు సమీపంలోని అనంతగిరి అడవుల్లో సోమవారం వీధి కుక్కల దాడిలో ఓ జింక(దుప్పి) మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. ఉదయం అడవిలో సంచరిస్తున్న జింక(దుప్పి)పై ఒక్కసారిగా వీధి కుక్కలు దాడి చేశాయి. గమనించిన పలువురు వాటిని చెదరగొట్టారు. అనంతరం అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. వారు వచ్చేలోపు జింక మృతి చెందింది.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
పరిగి: ఎదురుగా వస్తున్న బైక్‌ను కారు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన మండల పరిధిలోని తొండుపల్లి గ్రామ సమీపంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై సంతోష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శివశంకర్, రాము తొండుపల్లి నుంచి లాల్‌పహాడ్‌కు బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నగరానికి తరలించారు. ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై తెలిపారు.
యువకుడి అదృశ్యం
కేశంపేట: కుటుంబ సభ్యులతో గొడవపడిన యువకుడు అదృశ్యమైన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, సీఐ నరహరి తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన పెద్దిని మధు(25) చదువుకుంటూ గ్రామంలో తల్లిదండ్రులతో ఉంటున్నాడు. జనవరి 3న డబ్బు కోసం కుటుంబ సభ్యులతో గొడవపడిన ఇంటి నుంచి వెళ్లిపోయాడు. గతంలోనూ పలుమార్లు గొడవ పెట్టుకుని వెళ్లి తిరిగి వచ్చేవాడు. ఈ క్రమంలో ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుని వెళ్లిన మధు కోసం కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో సోమవారం తల్లి పద్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి నుంచి వెళ్లిన నాడు జీన్స్ ప్యాంట్, బ్లూ ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ ధరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment