
కాగితాల్లోనే కళాశాల
వికారాబాద్: పై ఫొటోలో కనిపిస్తున్న భవనం యాలాల మండలం తిమ్మాయిపల్లి గ్రామ శివారులోని డైట్ కళాశాల. రికార్డుల్లో మాత్రం ఇక్కడ డైట్ మొదటి, రెండో సంవత్సరం తరగతులు కొనసాగుతున్నట్లు లెక్క. గత ఏడాది ఈ కళాశాలలో అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు ప్రస్తుతం సెకెండ్ ఇయర్‌లో ఉండగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో 50 మంది ఛాత్రోపాధ్యాయులు అడ్మిషన్ తీసుకున్నట్టు రికార్డుల్లో ఉంది. మూడు నెలలుగా తరగతులు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఒక్క రోజు కూడా క్లాసులు జరిగిన దాఖలాలు లేవు. ఇంకా చెప్పాలంటే కళాశాల గేటుకు తాళం తీసింది కూడా లేదు. ప్రస్తుతం బెల్డింగ్ మొత్తం బూజు, దుమ్ము, ధూళి, పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డైట్ కళాశాలకు అనుమతులు పొందాలంటే నిర్వాహకులు రూ.12 లక్షల ఎఫ్‌డీలు సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఇవేవీ లేకుండానే పర్మిషన్ ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఓ సామాజిక కార్యకర్త ఎస్‌ఈఆర్టీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణకు ఆదేశించారు. విషయం డైట్ కళాశాల నిర్వాహకులకు తెలియడంతో శుక్రవారం వారు కాలేజీకి చేరుకొని పిచ్చి మొక్కలను తొలగించారు. తరగతి గదులను శుభ్రం చేశారు. రెండు మూడు రోజుల్లో అధికారులు విచారణకు వచ్చే అవకాశం ఉండటంతో విద్యార్థులను కూడా తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
శిక్షణ పొందకుండానే సర్టిఫికెట్లు
జిల్లాలో ఉపాధ్యాయ శిక్షణ రికార్డులకే పరిమితమైంది. ఎలాంటి తరగతులు నిర్వహించకుండానే ఉపాధ్యాయ శిక్షణను పూర్తి చేస్తున్నారు. ఎప్పటికప్పడు పర్యవేక్షించాల్సిన అధికారులు డైట్ కళాశాలల నిర్వాహకులతో కుమ్మకై ్క విద్యార్థులు లేకున్నా ఉన్నట్లు రిపోర్టులు ఇస్తున్నారు. అంతేకాకుండా పాడుబడిన భవనంలో కళాశాలను నిర్వహిస్తున్నారు. భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కళాశాల ఆవరణ మొత్తం పిచ్చి మొక్కలతో నిండి విష సర్పాలకు నిలియంగా మారింది. ఇక తరగతి గదుల విషయానికి వస్తే గోడలకు పగుళ్లు.. బూజు పట్టి అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 8 డైట్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ఒకటి ప్రభుత్వ కళాశాల కాగా ఏడు ప్రైవేట్‌వి. వీటిలో సమారు వెయ్యి మంది విద్యార్థులు ఉపాధ్యాయ శిక్షణ తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆధీనంలో కొనసాగుతున్న వికారాబాద్ డైట్ కళాశాల నిర్వహణ కాస్త మెరుగ్గా ఉండగా ప్రైవేట్ కళాశాలల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది.
మూడు నెలల క్రితమే ఉపాధ్యాయ శిక్షణ తరగతులు ప్రారంభం
బోధన చేయకుండానే శిక్షణ
ఇస్తున్నట్లు ప్రచారం
ఇదీ యాలాల మండలంలో డైట్ కళాశాల పరిస్థితి
ప్రిన్సిపాల్ సూచనల మేరకే రిపోర్టు ఇచ్చాం
ఈ విషయమై వికారాబాద్ ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపాల్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. జిల్లాలో ప్రైవేటు డైట్ కళాశాలల ఇన్‌స్పెక్షన్ కమిటీ సభ్యుడు రామ్‌రెడ్డిని వివరణ కోరగా.. తాను యాలాల మండలం తిమ్మాయిపల్లి గ్రామ శివారులోని డైట్ కళాశాలను తనిఖీ చేసి రిపోర్టు ఇచ్చిన మాట వాస్తవమే. కానీ ఆ కళాశాల ప్రిన్సిపాల్ రామాచారి సూచనల మేరకే రిపోర్టు ఇచ్చాం అని తెలిపారు.
కఠిన చర్యలు తీసుకోవాలి
అడ్మిషన్లు తీసుకొని తరగతులు నిర్వహించని యాలాల మండలంలోని డైట్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. విద్యార్థులు లేకున్నా ఉన్నట్లు రిపోర్ట్ ఇచ్చిన అధికారులపై వేటు వేయాలి. కళాశాల నిర్వహించడం లేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. విద్యార్థులు నష్టపోకుండా వారిని వేరే కళాశాలకు షిఫ్ట్ చేయాలి.
– దిడ్డికాడి గోపాల్, సామాజిక కార్యకర్త

కాగితాల్లోనే కళాశాల
Comments
Please login to add a commentAdd a comment