
అసమానతలు లేని ఆర్థిక వ్యవస్థ కావాలి
తుక్కుగూడ: దేశంలో ఆర్థిక లేని వ్యవస్థ కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఆపార్టీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పార్టీ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం తుక్కుగూడలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో సెమినార్ నిర్వహించారు. అంతకు ముందు కార్మికులు, కర్షకులతో కలిసి ఔటర్ రింగు రోడ్డు హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన అనంతరం నిరుపేదల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిందన్నారు. ఇదే సమయంలో కార్పొరేట్ శక్తుల ఆదాయం వంద రెట్లు పెరిగిందని ఆరోపించారు. దేశంలో జీఎస్టీ వసూలు పేరుతో పేదలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఖనిజ సంపదను పూర్తిగా బడా కంపెనీలకు దోచి పెడుతున్నారన్నారు. మతతత్వ బీజేపీపై పోరాడేందుకే తాము కాంగ్రెస్ పార్టీతో జత కట్టామని స్పష్టంచేశారు. దేశంలోని నిరుపేదలు, కార్మికులు, కర్షకుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నది కమ్యూనిస్టు పార్టీ మాత్రమేనని వెల్లడించారు. ప్రముఖ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ.. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రజాస్వామికవాదులు, కవులు, కళాకారులపై దాడులు, హత్యలు జరుగుతునయన్నారు. ఈ కార్యక్రమంలో ఆపార్టీ జిల్లా కార్యదర్శి పాలమాకులు జంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రచారి, నాయకులు పుస్తకాల నర్సింగ్‌రావు, పానుగంటి పర్వతాలు, యాదిరెడ్డి, దత్తునాయక్, నర్సింహ్మ, యాదయ్య, పార్టీ శ్రేణులు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
Comments
Please login to add a commentAdd a comment