
ఆధ్యాత్మిక చింతన అవసరం: సిద్ధలింగ మహాస్వామి
ప్రతిఒక్కరూ కొంత సమయాన్ని ఆధ్యాత్మిక చింతన కోసం కేటాయించాలని, మనసుకు ప్రశాంతత చేకూరుతుందని శ్రీజగద్గురు నిరంజన మఠం పీఠాధిపతులు డాక్టర్ సిద్ధలింగ మహాస్వామి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని శ్రీజగద్గురు నిరంజన మఠంలో స్వామివారి ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని భక్తులకు ప్రవచనాలు అందించారు. ప్రతిఒక్కరూ భక్తి, ధ్యానం, భగవత్ చింతన అలవర్చుకుంటే ఆరోగ్యంగా ఉండేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. భక్తితో దేన్నైనా సాధించొచ్చన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ, ధర్మాన్ని పరిరక్షిస్తూ సమాజ అభివృద్ధికి కృషిచేయాలని తెలిపారు. నిర్మలమైన మనసుతో భగవంతుడిని ఆరాధిస్తే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం సభ్యులు పాల్గొన్నారు.