ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేస్తే సహించం
ఇబ్రహీంపట్నం రూరల్: అంగన్ కేంద్రాలను నిర్వీర్యం చేయాలని చూస్తే సహించేది లేదని సీఐటీయూ జిల్లా కమిటీ హెచ్చరించింది. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రాజ్యలక్ష్మి, కవితల ఆధ్వర్యంలో సోమవారం 48 గంటల దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజు, చంద్రమోహన్‌లు మాట్లాడుతూ.. ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసి, పీఎం శ్రీ పథకాన్ని, మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాలను తీసుకురావాలని చూస్తుందని, ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన జాతీయ విద్యా విధాన చట్టాన్ని అమలు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు.
మూత పడనున్న ఐసీడీఎస్‌లు:
పీఎం శ్రీ పథకం కింద ప్రీ ప్రైమరీ కేంద్రాలను 28 జిల్లాల్లో 56 కేంద్రాలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, మొబైల్ అంగన్‌వాడీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి తెరలేపిందని ఆరోపించారు. తద్వారా ఐసీడీఎస్‌లు పూర్తిగా మూతపడే అవకాశం లేకపోలేదని, దీంతో పేద పిల్లలకు పౌష్టికాహారం దూరం కానుందని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందు అనేక హామీలను ఇచ్చి నేడు, విస్మరిస్తుందని విమర్శించారు. టీఏ, డీఏలు పెంచాలని, అంగన్‌వాడీ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. బీఎల్‌ఓ డ్యూటీలు రద్దు చేయాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో అంగన్‌వాడీల బలోపేతానికి బడ్జెట్ కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్, జగన్, జిల్లా నాయకులు కిషన్, దేవేందర్ పాల్గొన్నారు.
కలెక్టరేట్ వద్దే రాత్రి బస
48 గంటలు దీక్షకు పిలుపునివ్వడంతో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు రాత్రి కలెక్టరేట్ కార్యాలయం వద్దే బస చేశారు. అక్కడే వంటావార్పు చేశారు. రోడ్డుపైనే టెంట్ల కింద పడుకున్నారు. ఆట పాటలతో బతుకమ్మలు ఆడి సరదాగా గడిపారు. డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు కదిలేది లేదని స్పష్టంచేశారు.
సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్
కలెక్టరేట్ ఎదుట 48 గంటల దీక్ష