● ఈనెల 31లోపు ఆస్తి పన్ను చెల్లిస్తే తొంభైశాతం వడ్డీ మాఫీ ● తాండూరులో ఇప్పటివరకు వసూలైంది 37.55 శాతమే ● వేగం పెంచిన మున్సిపల్ అధికారులు ● మరో నాలుగు రోజులే గడువు
తాండూరు: మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన ఆస్తి పన్ను మొండి బకాయిలను వసూలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఓటీఎస్(వన్‌టైమ్ సెటిల్మెంట్)ను అమలు చేస్తోంది. ఒకేసారి ఆస్తిపన్ను చెల్లించిన ఇంటి యజమానులకు 90 శాతం వడ్డీ మాఫీ వర్తించేలా ఈనెల 25న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ లెక్కన మున్సిపాలిటీలో పేరుకుపోయిన పెండింగ్ బిల్లులను పూర్తి స్థాయిలో చెల్లిస్తే బకాయిదారులకు రూ.3.50 కోట్ల వడ్డీ మాఫీ అవుతుంది. ఈనెల 31లోపు చెల్లించే వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది.
లక్ష్యం రూ.13.57 కోట్లు..
తాండూరు మున్సిపాలిటీలోని 36 వార్డుల్లో మొత్తం 14,706 గృహాలున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను 13.57 కోట్ల ఆస్తి పన్ను డిమాండ్ ఉంది. ఆర్థిక సంవత్సరం ముగింపులోపు వందశాతం పన్నులు వసూలు చేయాలని మున్సిపల్ శాఖ అధికారులు టార్గెట్ విధించారు. కానీ ఆశించిన స్థాయిలో వసూలు కాలేదు. దీంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగానే వడ్డీ రాయితీ వెసులుబాటును కల్పించింది. ఈ అంశంపై అవగాహన కల్పిస్తున్న బిల్ కలెక్టర్లు వసూలు ప్రక్రియను వేగవంతం చేశారు. టాక్స్‌ల రూపంలో రూ.13.57 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా.. రూ.3.62 కోట్లు రాబట్టారు. దీంతో 37.55 శాతం బకాయిలు వసూలయ్యాయి.
31లోపు చెల్లిస్తే వడ్డీ మాఫీ
ఆస్తి పన్నులు రాబట్టేందుకు ప్రభుత్వం జీఓ నంబర్ 154ను జారీ చేసింది. దీని ద్వారా ఈనెల 31వ తేదీలోపు బకాయిలు చెల్లించేవారికి వడ్డీపై తొంభై శాతం మాఫీ వర్తిస్తుంది. తాండూరు మున్సిపల్ పరిధిలో ప్రాపర్టీ టాక్స్ చెల్లించే గృహ యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరో 4 రోజుల గడువు ఉన్నందున సాధ్యమైనంత త్వరగా చెల్లించాలి.
– విక్రంసింహారెడ్డి, కమిషనర్,
తాండూరు మున్సిపల్