తాండూరు రూరల్: మండల పరిధిలోని మల్కాపూర్, సంగెంకలాన్ గ్రామస్తులు భయందోళన చెందవద్దని అటవీశాఖ తాండూరు సెక్షన్ ఆఫీసర్ ఫిర్యానాయక్ సూచించారు. మల్కాపూర్ శివారులోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ క్వారీలో చిరుతపులి పిల్ల సంచరిస్తున్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం మల్కాపూర్‌లో సిమెంట్ ఫ్యాక్టరీ క్వారీ సమీపంతో పాటు సంగెంకలాన్ శివారులో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫిర్యానాయక్ మాట్లాడుతూ... తాండూరు ఫారెస్ట్ రేంజ్ అఽధికారిణి శ్రీదేవి సరస్వతి ఆదేశాల మేరకు మూడు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. చిరుతపులి పిల్ల సంచరిస్తే ట్రాప్ కెమెరాలు దృశ్యాలు నమోదు అవుతాయని చెప్పారు. అట్టి దృశ్యాల ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయాలపై చర్చిస్తామన్నారు. కార్మికులతో పాటు ఆయా గ్రామస్తులు చిరుతపులి పిల్ల కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అటవీశాఖ బీట్ ఆఫీసర్ మల్లయ్య, సిమెంట్ ఫ్యాక్టరీ సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.
అటవీశాఖ తాండూరు సెక్షన్ ఆఫీసర్ ఫిర్యానాయక్