కొడంగల్ రూరల్: దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.. ఆదివారం నగరంలోని తన నివాసంలో విశ్వావసు నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి ధూప దీప నైవేద్య అర్చక సంఘం(డీడీఎన్‌ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవశర్మ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. డీడీఎన్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు లోకూర్తి జయతీర్థాచారి నేతృత్వంలో జిల్లాలోని అర్చక బృందం హాజరైంది. కార్యక్రమంలో కిట్టు స్వామి(విజయకృష్ణ జ్యోషి) తదితరులున్నారు.
భక్తి భావంతో మెలగాలి
ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
పరిగి: ప్రతి ఒక్కరూ భక్తి భావంతో మెలగాలని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పట్టణ కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి 38వ బ్రహ్మోత్సవాలు ముగిసిన నేపథ్యంలో ఆదివారం ఆయన.. పలువురిని సన్మానించి, ప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అందరి సహకారంతోనే స్వామివారి కార్యక్రమం పూర్తయిందన్నారు. స్వామివారికి సేవ చేయడమంటే.. పూర్వజన్మ సుకృతమేనని, ఏటేటా ఉత్సవాలను మరింత బ్రహ్మాండగా జరుపుకొందామని సూచించారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్ పార్థసారథి, కమిటీ సభ్యులు గోపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఉరి వేసుకొనివ్యక్తి ఆత్మహత్య
బంట్వారం: జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదివారం కోట్‌పల్లి మండలంలోని ఎన్కెపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కోట్‌పల్లి ఎస్‌ఐ అబ్దుల్ గఫార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎన్కెపల్లికి చెందిన బోయిని అశోక్(33), వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించే వాడు. కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో భార్య నవనీత కుమారుడిని తీసుకొని పుట్టింటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శనివారం రాత్రి దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం స్థానికులు గమనించి, భార్య నవనీతకు సమాచారం అందించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బాలిక అదృశ్యం
పహాడీషరీఫ్: ఆడుకునేందుకు వెళ్లిన ఓ బాలిక అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ గురువారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పప్పుయాదవ్ యాదవ్ కుటుంబం నాలుగేళ్ల క్రితం వలస వచ్చి దేవేందర్ నగర్ కాలనీలో నివాసం ఉంటోంది. అతని కుమార్తె కాజల్(11) 3వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో ఈ నెల 22న మధ్యాహ్నం 12.30 గంటలకు ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారి.. తిరిగి రాలేదు. దీంతో బాలిక కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. ఇంట్లో మందలించడంతో చిన్నారి బయటకు వెళ్లిందని, తెలుగు, హిందీలో మాట్లాడుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వివరాలు తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్, లేదా 87126 62367 నంబర్‌లో సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
నూతన పంచాంగం ఆవిష్కరణ