
చెడ్డీ గ్యాంగ్ ఆటకట్టిస్తాం
బెట్టింగ్‌లో మోసపోయిన వారు ధైర్యంగా ఫిర్యాదు చేయాలి
● అటెన్షన్ డైవర్షన్ కేసుల ఛేదనకు ప్రత్యేక బృందాలు ● ప్రైవేటు వాహనాలకు సైరన్లు ఉండొద్దు ● మున్సిపాలిటీల్లో ట్రాఫిక్ సమస్యను సామాజిక కోణంలో చూడాలి ● ‘సాక్షి’ తో ఎస్పీ నారాయణరెడ్డి
వికారాబాద్: ‘జిల్లాలో బెట్టింగ్ వ్యవహారం మా దృష్టికి వచ్చింది..కానీ ఎవరూ ఫిర్యాదు చేయ డం లేదు.. బాధితులు తమను సంప్రదిస్తే న్యాయం జరిగేలా చూస్తాం..’ అని ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు. బెట్టింగ్ భూతం, దొంగతనాలు, చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్, దొంగతనాలు, అటెన్షన్ డైవర్షన్ కేసులు, ట్రాఫిక్ సమస్యలపై ‘సాక్షి’ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన సమాధానాలు ఇలా..
సాక్షి: జిల్లాలో బెట్టింగ్ నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
ఎస్పీ నారాయణరెడ్డి: బెట్టింగ్ అనేది ప్రధానంగా రెండు, మూడు రకాలుగా ఉంటుంది. యాప్‌ల ద్వారా బెట్టింగ్ ఆడటం.. క్రికెట్ బెట్టింగ్, క్యాసినోల ద్వారా బెట్టింగ్ ఆడుతుంటారు. మన ప్రాంతంలో క్రికెట్ బెట్టింగ్ ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిసింది. ఆర్గనైజ్డ్ బెట్టింగులతో ఎక్కువ ప్రమాదం ఉంటుంది. ముందుగా గెలుపు రుచి చూపించి ఉచ్చులోకి దింపుతారు.ఆ తర్వాత డబ్బులన్నీ లాగేస్తారు. బెట్టింగ్ బారిన పడి డబ్బు పోగొ ట్టుకున్న వారు లేదా బాధితుల తల్లిదండ్రులు పోలీస్ శాఖను సంప్రదిస్తే నిర్వాహకులపై కేసులు నమోదు చేసి న్యాయం జరిగేలా చూస్తాం. బా ధితుల వివరాలు గోప్యంగా ఉంచుతాం. తల్లిదండ్రులు పిల్లల కదలికలపై నిఘా పెట్టాలి.
సాక్షి: జిల్లాలో దొంగతనాలు, చెడ్డీ గ్యాంగ్, అటెన్షన్ డైవర్షన్ మోసాలను ఎలా కట్టడి చేస్తారు?
ఎస్పీ: జిల్లాలో దొంగతనాలు కొంత మేర పెరిగిన మాట వాస్తవమే.. చోరీ సొత్తులో 60 నుంచి 70 శాతం రికవరీ చేస్తున్నాం. వికారాబాద్‌లో చెడ్డీ గ్యాంగ్ దొంగతనం, తాండూరులో 45 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లిన కేసుల ఛేదనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. త్వరలో ఆ ముఠాలను పట్టుకుంటాం. చాలా వరకు చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించాం. అంతర్రాష్ట్ర ముఠాల అటెన్షన్ డైవర్షన్ కేసుల్లో పురోగతి సాధించాం. ప్రజలు మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం జిల్లాలో ఐదారు వేల సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని ఏర్పాటు చేసుకుంటే కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు అవకాశం ఉంటుంది.
సాక్షి: కొంతమంది సొంత వాహనాలకు సైరన్లు ఏర్పాటు చేసుకున్నారు.. వాటిని ఎలానియంత్రిస్తారు?
ఎస్పీ: ఈ విషయం మా దృష్టికి రాలేదు. ప్రైవే టు వ్యక్తుల వాహనాలకు సైరన్లు ఉంటే తొలగిస్తాం. అంబులెన్స్, పోలీసు వాహనాలకు మినహా ఎవ్వరికీ అనుమతి ఇవ్వలేదు.
సాక్షి: వికారాబాద్, తాండూరు పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి మీరు తీసుకునే చర్యలు?
ఎస్పీ: ట్రాఫిక్ సమస్య అనేది లా అండ్ ఆర్డర్ తోపాటు సామాజిక సమస్య కూడా. దీన్ని రెండు కోణాల్లో చూడాలి. ఒకటి వాహనాలను పార్కింగ్ చేయడానికి స్థలం లేకపోవడం. వెహికల్స్ రాకపోకలకు, పాదచారులకు ఇబ్బంది కలగనంత వరకు కొంత సానుకూల ధోరణితో వ్యవహరిస్తాం. ఏ మాత్రం ఇబ్బందులు తలెత్తినా చర్యలు తీసుకుంటాం. పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే సమస్యలు రావు.

చెడ్డీ గ్యాంగ్ ఆటకట్టిస్తాం