
సత్వర పరిష్కారం
● అందుబాటులోకి ‘ఫీడర్ ఔటేజ్ మేనేజ్‌మెంట్ సిస్టం’ ● ‘సూపర్ వైజరీ కంట్రోల్ అండ్ డేటాఆక్వజేషన్’తో అనుసంధానం ● అందుబాటులోకి తెచ్చిన దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. సబ్‌స్టేషన్లలో తరచూ తలెత్తే సాంకేతిక సమస్యలు సహా విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు, ఈదురుగాలితో కూడిన వర్షానికి ఫీడర్ ట్రిప్ అవుతుండటం, షార్ట్‌సర్క్యూట్ కారణంగా అండర్ గ్రౌండ్(యూజీ) కేబుల్స్, ఎయి ర్ బంచడ్ (ఏబీ) కేబుల్స్ జాయింట్ల వద్ద తలెత్తే సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిన విద్యుత్ సరఫరాపై సీఎండీ మొదలు క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అలర్ట్ చేసే ‘ఫీడర్ ఔటేజ్ మేనేజ్‌మెంట్ సిస్టం’ (ఎఫ్‌ఓఎంఎస్) సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే అమల్లో ఉన్న ‘సూపర్ వైజరీ కంట్రోల్ అండ్ డేటా ఆక్వజేషన్’ (స్కాడా)కు అనుసంధానం చేసింది. దీంతో ఏ సబ్‌స్టేషన్‌లోని ఫీడర్.. ఏ సమయంలో ట్రిప్ అయింది.. ఏ ప్రాంతానికి.. ఎంత సమయం కరెంట్ సర ఫరా నిలిచిపోయింది.. సరఫరాను ఎన్ని గంటల్లో పునరుద్ధరించారు.. వంటి సమగ్ర సమాచారం ఉన్నతాధికారులకు చేరవేస్తోంది. ఫలితంగా కరెంట్ కోతలు, సరఫరా పునరుద్ధరణలో చోటు చేసుకుంటున్న జాప్యంపై క్షేత్రస్థాయి సిబ్బంది సాకులు చెప్పి తప్పించుకునే అవకాశం ఉండదు.
ఆరా తీయాల్సిన అవసరం లేకుండా..
ఈదురు గాలులతో కూడిన వర్షానికి పెద్ద సంఖ్యలో ఫీడర్లు ట్రిప్పవుతుంటాయి. ఒకేసారి అనేకప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఈ సమయంలో ఎవరైనా వినియోగదారులు ఫ్యూజ్ ఆఫ్ కాల్‌సెంటర్ (ఎఫ్‌ఓసీ) సహా 1912/ లేదా క్షేత్రస్థాయి జేఎల్‌ఎం, ఏఈలకు సమాచారం ఇస్తే కానీ సంబంధిత అధికారులకు విషయం తెలిసేది కాదు. సాంకేతిక సమస్య గుర్తింపు క్షేత్రస్థాయి సిబ్బందికి పెద్ద సమస్యగా మారేది. అర్థరాత్రి జోరున కురిసే వర్షం లోనూ లైన్ టు లైన్ తిరగాల్సి వచ్చేది. సమస్యను గుర్తించి, సరఫరాను పునరుద్ధరించేందుకు రెండు మూడు గంటల సమ యం పట్టేది. ఇంట్లో కరెంట్ లేకపోవడంతో వినియోగదారుల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యా దులు వచ్చేవి. ఈ సమయంలో సీఎండీ సహా ఇతర ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి ఫోన్ చేసి ఆరా తీస్తే.. సరైన కారణం చెప్పే వారు కాదు. కొంత మందైతే ఏకంగా ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించే వారు. ఇది వారికి తలనొప్పి గా మారేది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ ఫీడర్ ఔటేజ్ మేనేజ్‌మెంట్ సిస్టంతో తలెత్తిన సాంకేతిక సమస్యతో పాటు సరఫరా పునరుద్ధరణ వెంటనే తెలిసిపోతుంది. కేంద్ర కార్యాలయాల్లో కూర్చొనే క్షేత్రస్థాయి సిబ్బంది పని తీరును మానిటరింగ్ చేసే వెసులుబాటు కలుగుతుంది.
అత్యవసర పరిస్థితుల్లో కీలకం
గ్రేటర్‌లో 11 కేవీ ఫీడర్లు 3,421 వరకు ఉన్నాయి. వీటిలో 1,353 ఫీడర్లను ఇప్పటికే ఈ ఎఫ్‌ఓఎంఎస్ పరిధిలోకి తీసుకొచ్చింది. ఆయా ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లోనే తెలుసుకునే అవకాశం ఉంది. నాలుగు రోజుల క్రితం భారీ ఈదురుగాలితో కూడిన వర్షానికి గ్రేటర్‌లో 449 ఫీడర్లు ట్రిప్పయ్యాయి. ఈ ఎఫ్‌ఓఎంఎస్ సహకారంతో 410 ఫీడర్ల పరిధిలో అర గంటలోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. సోమవారం హైదరాబాద్ సౌత్ సర్కిల్ పరిధిలో హిందీనగర్, ఆలియాబాద్, బ్యాంక్‌కాలనీ సహా హబ్సీగూడ సర్కిల్ పరిధిలో బోడుప్పల్, సూర్యహిల్స్‌కాలనీ ఫీడర్ల పరిధిలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలోని ప్రాగాటూల్స్, రైతుబజార్, మేడిబావి, ఆర్పీనిలయం, ఈఎంఈ ఫీడర్ల పరిధిలోనూ సాంకేతిక సమస్యలు వచ్చాయి. ఆయా ప్రాంతాల్లోని గృహాలు, వాణిజ్య సముదాయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎఫ్‌ఓఎంఎస్ సాంకేతిక పరిజ్ఞానంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాలకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరఫరాను పునరుద్ధరించడంతో పాటు తలెత్తిన సాంకేతిక సమస్యలను గుర్తించి, వ్యవస్థను చక్కదిద్దే పనిలో నిమగ్నమయ్యారు.