
దాడి చేసిన వారిపై చర్యలకు డిమాండ్
అనంతగిరి: కరీంపూర్ గ్రామంలో అమాయకులపై దాడులు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామ మాజీ సర్పంచ్, బీఆర్‌ఎస్ నాయకుడు అనిల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కరీంపూర్ గ్రామస్తులు మంగళవారం వికారాబాద్‌లోని ఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో పలువురు అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. గ్రామానికి చెందిన ఆజాం ఆయన అనుచరులు అకారణంగా తమపై దాడి చేశారన్నారు. ఈ విషయమై ఫిర్యాదు చేయగా అక్కడికి వచ్చిన స్థానిక పోలీసుల సమక్షంలోనే దాడికి పాల్పడ్డారని తెలిపారు. తాము ఇచ్చిన ఫిర్యాదుకు ఇప్పటి వరకు స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాము ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయిస్తామన్నారు. ఎస్పీ ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామంలో శాంతియుత వాతవరణం కల్పించాలని కోరారు.
ఎస్పీ కార్యాలయం ఎదుట కరీంపూర్ గ్రామస్తుల ఆందోళన