
పార్టీని బలోపేతం చేద్దాం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి
కుల్కచర్ల: క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేద్దామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరణం ప్రహ్లాదరావు అన్నారు. బుధవారం కుల్కచర్ల మండల కేంద్రంలో బూత్ కమిటీ అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. కేంద్రం వివిధ అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తామే అభివృద్ధి చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఎక్కువ మంది గెలిచేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను, నెరవేర్చని హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేంద్ర టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యుడు ఘనపురం వెంకటయ్య, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సౌమ్యారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు వెంకటయ్య ముదిరాజ్, దిశ కమిటీ సభ్యులు జానకిరాం చౌహాన్, జిల్లా కార్యవర్గ సభ్యుడు కాటనిపల్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.