
సన్న బువ్వ.. విజయీభవ
సన్న బియ్యంపంపిణీపై హర్షం
● రేషన్ షాపులకు క్యూ కడుతున్న జనం ● జిల్లాలో మొత్తం దుకాణాలు 588 ● కార్డులు 2,48,122, లబ్ధిదారులు 8,52,122 మంది ● ప్రతినెలా పంపిణీ చేస్తున్న బియ్యం 5,582 మెట్రిక్ టన్నులు
వికారాబాద్: వరి అన్నాన్ని జేజ బువ్వ అని ముద్దుగా పిలుచుకోవడం మనందరికీ తెలుసు.. అందులోనూ సన్నబియ్యం అన్నం తినడం అంటే పేదలకు గొప్ప విషయమేనని చెప్పాలి. అలాంటి కలను ప్రభుత్వం నెరవేర్చడంతో రేషన్ లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం పంపిణీ చేసినంత కాలం తీసుకునేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎప్పుడైతే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారో దుకాణాలకు క్యూ కడుతున్నారు. ఈ పథకంపై ఎవ్వరిని కదిపినా సన్నబియ్యం పంపిణీ చాలా మంచి కార్యక్రమం అని కితాబు ఇస్తున్నారు. దొడ్డు బియ్యాన్ని కేవలం దోసె పిండికి మాత్రమే వినియోగించేవారు.. చాలా మంది కిరాణా దుకాణాల్లో విక్రయించేవారు. ప్రస్తుతం సన్నబియ్యం ఇస్తుండటంతో ప్రతి ఒక్కరూ రేషన్ షాపునకు వస్తున్నారు. జిల్లాలో 588 రేషన్ దుకాణాలు.. 2,48,122 కార్డులు.. 8,52,122 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున 5,582 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు.
ప్రజల నమ్మకం వమ్ము కాకుండా చూడాలి
మిల్లర్ల మాయాజాలం.. రేషన్ డీలర్ల కుమ్మక్కు మంత్రం.. అధికారుల పర్యవేక్షణ లోపంతో గతంలో రేషన్ బియ్యం పంపిణీ పథకం అభాసుపాలైన విషయం అందరికీ తెలిసిందే.. ఇప్పటి వరకు పంపిణీ చేసిన దొడ్డు బియ్యంలో 50 శాతానికి పైగా తినకుండా బయట విక్రయించారు. మిల్లర్లు దొడ్డు బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి రీసైక్లింగ్ తర్వాత మళ్లీ లెవీ రూపంలో ప్రభుత్వానికి అందజేసేవారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ప్రభుత్వం మిల్లులకు తరలించగా వాటిని మిల్లర్లు బహిరంగ మార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో లబ్ధిదారులు రేషన్ దుకాణాల బాట పడుతున్నారు.