
నిత్యాన్నదానం అభినందనీయం
ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి
తాండూరు: దశాబ్దాల తర్వాత తాండూరు భావిగి భద్రేశ్వర స్వామి ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించడం అభినందనీయమని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన అన్నపూర్ణమాత దాసోహ భవనాన్ని ఆలయ కమిటీ చైర్మన్ పటేల్ కిరణ్, వీరశైవ సమాజం ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం శివపార్వతుల కల్యాణోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరి కృషితో ఆలయం అభివృద్ధి చెందుతోందన్నారు. గతంలో ఇక్కడ అన్నదానం జరిగేదని.. భవనం శిథిలం కావడంతో నిలిచి పోయిందన్నారు. ఆలయ కమిటీ, వీరశైవ సమాజం ప్రతినిధులు నూతన భవనాన్ని నిర్మించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్వామివారి జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి థారాసింగ్, హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింహులు, వీరశైవ సమాజం అధ్యక్షుడు ఆర్.బస్వరాజ్, సభ్యులు పటేల్ శ్రీశైలం, కోర్వార్ నగేష్, లింగదల్లి రవి తదితరులు పాల్గొన్నారు.
త్వరలో చిలుక వాగు ప్రక్షాళన
పట్టణంలో వర్షపు నీరు సజావుగా వెళ్లేందుకు చిలుక వాగు ప్రక్షాళన పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో భాగంగా తాండూరులోని కొడంగల్ మార్గంలో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.
తాండూరులో సబ్‌కోర్టు ఏర్పాటుకు కృషి
తాండూరు బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. తాండూరు మున్సిఫ్ కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. పట్టణంలో సబ్ కోర్టు ఏర్పాటయ్యేలా చూడాలని బార్ అసోసియేషన్ ప్రతినిధులు కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సబ్‌కోర్టు ఏర్పాటయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.