
నేడు డయల్ యువర్ డీఎం
తాండూరు టౌన్: తాండూరు ఆర్టీసీ డిపో పరిధిలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ సురేశ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు సెల్ నంబర్ 99592 26251కు కాల్ చేసి సమస్యలు తెలియజేయాలని ప్రయాణికులను కోరారు. ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రిన్సిపాల్‌పై చర్యలకు రంగం సిద్ధం ?
వికారాబాద్: కొత్తగడి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌పై చర్యలకు రంగం సిద్ధమైంది. పాఠశాలలో విద్యార్థినులపై వరుస వేధింపుల నేపథ్యంలో బాలల హక్కుల పరిరక్షణ వేదిక బృందం ఇటీవల ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో కమిషన్ చైర్మన్.. కలెక్టర్‌కు ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. కొత్తగడి గురుకుల ఘటనపై నివేదిక ఇవ్వడంతోపాటు ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో చర్యలకు సిఫారసు చేస్తూ కలెక్టర్ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శికి లేఖ రాసినట్టు సమాచారం.
అసలేం జరిగిందంటే..
నెల రోజుల క్రితం వికారాబాద్ సమీపంలోని కొత్తగడి గురుకులంలో సిబ్బంది వేధిస్తున్నారంటూ ఓ బాలిక భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన మరువక ముందే ప్రిన్సిపాల్ కొంతమంది విద్యార్థినులను తన చాంబర్‌కు పిలిపించుకొని బూతులు తిట్టే వీడియో బయటికి వచ్చింది. దీనిపై స్థానికులు, విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై సీఆర్‌పీఎఫ్ రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ సభ్యులు గత సోమవారం ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కలిసి ఫిర్యాదు చేశారు. బీసీ కమిషన్ ఆదేశాలతో కమిటీ వేసిన అధికారులు విచారణ చేపట్టి నివేదిక సమర్పించారు. అనంతరం విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఎలాంటి చర్యలు లేకుండా చేతులు దులుపుకొన్నారు. ఆ తర్వాత విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలకు దిగిన వీడియో వైరల్ కావటంతో ఎస్సీ కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం.
నేడు తాండూరులో ఎంపీ కొండా పర్యటన
తాండూరు రూరల్: మండలంలో శనివారం చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పర్యటించనున్నట్లు బీజేపీ నాయకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గోనూర్, వీర్‌శెట్టిపల్లి, నారాయణపూర్ గ్రామాల్లో ఎంపీ నిధులు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అనంతరం పెద్దేముల్ మండంలోని మంబాపూర్, నర్సాపూర్ గ్రామాల్లో పర్యటిస్తారని పేర్కొన్నారు. బీజేపీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై ఎంపీ పర్యటనను విజయవంతం చేయాలని వారు కోరారు.
జ్యోతిబాపూలే ఆశయ సాధనకు కృషి
తాండూరు టౌన్: మహాత్మా జ్యోతిబాపూలే జయంతిని పురస్కరించుకుని బీసీ సంఘం, గ్లోబల్ యువతరం ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌మేళాలో 86 మంది ఉద్యోగాలు సాధించారు. స్థానిక సింధు బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన జాబ్‌మేళాకు 300 మంది నిరుద్యోగ యువతీ, యువకులు హాజరయ్యారు. 10 ఎన్‌ఎంసీ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రాలను అందజేశారు. అనంతరం రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. జ్యోతిబాపూలే ఆశయ సాధనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. విద్య ఏ వర్గానికి సొంతం కాదని, అణగారిన వర్గాల పిల్లలు సైతం విద్యను ఆర్జించవచ్చని, ప్రజల్లో చైతన్యం రగిలించిన పోరాటం మరువలేమన్నారు. గ్లోబల్ యువతరం ఫౌండేషన్ సభ్యులు జాబ్‌మేళా నిర్వహణలో పాలుపంచుకోవడం అభినందనీయమన్నారు. భవిష్యత్‌లో మరిన్ని జాబ్‌మేళాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో గ్లోబల్ యువతరం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయేందర్, కార్యదర్శి అరుణ్ రాజ్, సింధు కళాశాల వ్యవస్థాపకులు రంగారావు, బీసీ సంఘం నాయకులు సయ్యద్ షుకూర్, అనిత, మంజుల, లక్ష్మీనర్సమ్మ, విజయలక్ష్మి, శ్రీనివాస్, బస్వరాజ్, శ్రావణ్, రామకృష్ణ, లక్ష్మణాచారి, రమేష్, బసంత్, జగదీశ్వర్, సిద్ధార్థ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.