
దేశాభివృద్ధే మోదీ ఆశయం
ధారూరు: బీఆర్‌ఎస్ ప్రభుత్వ అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. అప్పటి సీఎం కేసీఆర్, కొంతమంది మంత్రుల నియోజకవర్గాలు మాత్రమే అభివృద్ధి చెందాయని, మిగిలిన ప్రాంతాలను విస్మరించారని విమర్శించారు. ఉపాధి హామీ పథకం, ఎంపీ నిధులతో మండలంలోని నాగారం, స్టేషన్‌ధారూరు, ధారూరు, రుద్రారం, అల్లీపూర్ గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్లను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి రాష్ట్రం, రాష్ట్రాల్లోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్నదే ప్రధాని మోదీ ఆశయమని పేర్కొన్నారు. తనకు కేటాయించిన ఎంపీ నిధుల్లో ఎక్కువ శాతం ఇక్కడే ఖర్చు చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. కోట్‌పల్లి ప్రాజెక్టు నీరు అందక పంటలు ఎండుతున్నాయని రైతులు ఎంపీ దృష్టికి తెచ్చారు. వెంటనే ప్రాజెక్టు కాలువలను పరిశీలించి ఇరిగేషన్ ఈఈతో ఫోన్‌లో మాట్లాడారు. రబీ పంటలకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, ఉపాధ్యక్షుడు వివేకానందరెడ్డి, అసెంబ్లీ కోఆర్డినేటర్ వడ్ల నందు, పార్టీ మండల అధ్యక్షుడు రాజునాయక్, సీనియర్ నాయకులు పాండుగౌడ్, మండల మాజీ అధ్యక్షుడు ఎం.రమేశ్, జిల్లా అధికార ప్రతినిధి రాజేందర్‌గౌడ్, నాయకులు రుద్రారం వెంకటయ్య, ఉపేందర్, సాయిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
మండలంలో సీసీ రోడ్లు ప్రారంభం