● ఏజెంట్ల ద్వారా విక్రయాలు ● వానాకాలం సీజన్‌కు ముందే దందా షురూ.. ● బ్రాండెడ్‌ కంపెనీల పేరుతో మోసం ● నష్టపోతున్న అన్నదాతలు | - | Sakshi
Sakshi News home page

● ఏజెంట్ల ద్వారా విక్రయాలు ● వానాకాలం సీజన్‌కు ముందే దందా షురూ.. ● బ్రాండెడ్‌ కంపెనీల పేరుతో మోసం ● నష్టపోతున్న అన్నదాతలు

Apr 13 2025 7:56 AM | Updated on Apr 13 2025 7:56 AM

● ఏజె

● ఏజెంట్ల ద్వారా విక్రయాలు ● వానాకాలం సీజన్‌కు ముందే దం

కొడంగల్‌: నియోజకవర్గంలో నాసిరకం పత్తి విత్తనాల దందాకు తెరలేసింది. వానాకాలం సీజన్‌కు ముందే పలు గ్రామాల్లో ఏజెంట్లను నియమించుకొని వారి ద్వారా విక్రయాలు చేపట్టారు. నిరుద్యోగ యువకులకు డబ్బులు ఆశ చూపి నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. బ్రాండెడ్‌ కంపెనీల కవర్లలో నాసిరకం విత్తనాలు నింపి విక్రయిస్తున్నారు. అభం శుభం తెలియని రైతులు వాటిని కొనుగోలు చేసి పంట దిగుబడి రాక నష్టపోతున్నారు.

కర్ణాటక నుంచి సరఫరా..

రాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్ణాటక రాష్ట్రం నుంచి నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతోంది. హైదరాబాద్‌ – బీజాపూర్‌ జాతీయ రహదారిపై కొడంగల్‌కు 45 కిలోమీటర్ల దూరంలో కర్ణాటకకు చెందిన గుర్మిట్కల్‌ పట్టణం ఉంది. అక్కడి ఎరువుల వ్యాపారి నకిలీ విత్తనాల దందా చేస్తున్నట్లు తెలిసింది. అతను కర్ణాటకలోని కుష్టిగిరి జిల్లాలో ఉన్న జిన్నింగ్‌ మిల్లు నుంచి తక్కువ ధరకు నాసిరకం పత్తి విత్తనాలు కొనుగోలు చేస్తాడు. వాటిని బ్రాండెడ్‌ కంపెనీల కవర్లలో ప్యాకింగ్‌ చేసి గ్రామాలకు సరఫరా చేస్తున్నట్లు గతంలో అతనిపై కేసులు నమోదయ్యాయి. అతను హైదరాబాద్‌లోని ఒక ప్యాకింగ్‌ కంపెనీలో బ్రాండెడ్‌ కంపెనీల కవర్లను కొనుగోలు చేసి నాసిరకం విత్తనాలు పోసి ఏజెంట్ల ద్వారా విక్రయిస్తున్నాడు. నియోజకవర్గంలోని కొడంగల్‌, దౌల్తాబాద్‌ మండలాల్లో ఆయనకు ఏజెంట్లు ఉన్నట్లు సమాచారం. వారి ద్వారానే నకిలీ దందా జోరుగా సాగుతున్నట్లు తెలిసింది.

జైలుకు వెళ్లినా మారని బుద్ధి

గతంలో కొడంగల్‌ మండలం అన్నారం గ్రామంలో ఓ వ్యక్తి ఇంట్లో నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ దొరికిన సామగ్రిని చూసి అధికారులు నివ్వెర పోయారు. 320 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, బ్రాండెడ్‌ కంపెనీల పేరుతో ఉన్న 60 ప్యాకెట్లు, వివిధ కంపెనీల పేరుతో తయారు చేయించిన 290 పోర్జరీ కవర్లు, విత్తనాలు కొలిచే డబ్బా దొరికింది. అదే రోజు నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. నిందితుల సమాచారంతో పోలీసులు తీగలాగితే డొంక కదిలింది. పోలీసులు నిఘా పెంచడంతో సూత్రధారులు, పాత్రధారులు పట్టుబడ్డారు. కొంత కాలానికి వారు రిమాండ్‌పై వచ్చి తిరిగి దందా కొనసాగిస్తున్నట్లు తెలిసింది. మరో రెండు నెలల్లో వానాకాలం సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ తరుణంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

టాస్క్‌ఫోర్స్‌ దాడిలో..

రెండేళ్ల క్రితం కొడంగల్‌ మండలం నందిగామ గ్రామ శివారులో ఓ రైతు పొలం వద్ద 25 కిలోల నకిలీ పత్తి విత్తనాలు ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు గుర్తించారు. సదరు రైతును విచారించగా దౌల్తాబాద్‌ మండలం గోకఫస్లాబాద్‌ గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద కొనుగోలు చేసినట్లు చెప్పాడు. పోలీసులు, వ్యవసాయాధికారులు గోకఫస్లాబాద్‌లో సోదాలు నిర్వహించగా 14క్వింటాళ్ల నాసిరకం పత్తి విత్తనాలు దొరికాయి. విచారించగా మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం అమిస్తాపూర్‌ గ్రామంలోని ఒక ప్రాసెసింగ్‌ యూనిట్‌ దగ్గర కొన్నట్లు తేలింది. నిందితులపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఇలాంటి సంఘటనలు నియోజకవర్గంలో మళ్లీ పునరావతం అవుతున్నాయి. ప్రతి ఏడాది అధికారులు దాడులు చేసినా నకిలీ మకిలీని అరికట్ట లేకపోతున్నారు. వ్యవసాయాధికారులు, పోలీసులు కఠిన చర్యలు తీసుకొని నకిలీ విత్తనాలను అరికట్టాలని రైతులు కోరుతున్నారు.

నకిలీ.. మకిలీ

నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

యాలాల: మండలంలోని బాగాయిపల్లి చౌరస్తాలో 22 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను టాస్క్‌ఫోర్స్‌, యాలాల పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను తాండూరు డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నారాయణరెడ్డి వెల్లడించారు. ఉదయం 6గంటల ప్రాంతంలో బాగాయిపల్లి చౌరస్తాలో ముగ్గురు వ్యక్తులు ప్లాస్టిక్‌ సంచులతో ఉన్నారు. తనిఖీలు నిర్వహించేందుకు వచ్చిన పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించారు. ముగ్గురిలో ఇద్దరిని పట్టుకోగా ఒక వ్యక్తి పారిపోయాడు. ప్లాస్టిక్‌ సంచులను పరిశీలించగా రూ.44 లక్షల విలువైన 22 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు బయటపడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా కురుబల కోట మండలం అంగళ్ల గ్రామానికి చెందిన నన్నపనేని శివనాగేశ్వరరావు, గుంటూరు జిల్లా చేబ్రోలుకు చెందిన దాసరి శ్రీనివాస్‌రావు, కొత్తకోటకు చెందిన నారాయణరెడ్డి నకిలీ పత్తి విత్తనాలను దుకాణాలు, రైతులకు విక్రయించడానికి వచ్చినట్లు పోలీసులు విచారణలో తేలింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పారిపోయిన వ్యక్తి నారాయణరెడ్డిగా గుర్తించినట్లు తెలిపారు. నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. గుర్తు తెలియని వ్యక్తులు, అనుమతి లేని డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేయరాదని సూచించారు. ఆధీకృత డీలర్‌ వద్దే కొనుగోలు చేసి రశీదు పొందాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్‌ సీఐ నగేష్‌, టాస్క్‌ఫోర్స్‌ సీఐ అన్వర్‌ పాషా, యాలా ల ఎస్‌ఐ గిరి, ఏఓ శ్వేతరాణి తదితరులు పాల్గొన్నారు.

అప్రమత్తంగా ఉండాలనిరైతులకు ఎస్పీ నారాయణరెడ్డి సూచన

● ఏజెంట్ల ద్వారా విక్రయాలు ● వానాకాలం సీజన్‌కు ముందే దం1
1/1

● ఏజెంట్ల ద్వారా విక్రయాలు ● వానాకాలం సీజన్‌కు ముందే దం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement