వాల్టా.. పల్టా | - | Sakshi
Sakshi News home page

వాల్టా.. పల్టా

Published Mon, Apr 28 2025 7:22 AM | Last Updated on Mon, Apr 28 2025 7:22 AM

వాల్ట

వాల్టా.. పల్టా

జిల్లాలో యథేచ్ఛగాబోరుబావుల తవ్వకం ● అనుమతులు పదుల్లో.. డ్రిల్లింగ్‌ వేలల్లో.. ● గత ఏడాది నాలుగింటికే పర్మిషన్‌ ● 80 పైచిలుకు బోరు బండ్లు ● రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవి ఏడు మాత్రమే.. ● చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం

వికారాబాద్‌: జిల్లాలో ఎలాంటి అనుమతులు పొందకుండా ఏటా వేల సంఖ్యలో బోరుబావులు తవ్వుతూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. గత ఏడాది అధికారికంగా నాలుగు బోర్లు తవ్వుకోవడానికి మాత్రమే అనుమతులు వచ్చాయి. కానీ రోజుకు సగటున 300లకు పైగా డ్రిల్లింగ్‌ వేస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన ఏటా 2,500 నుంచి 3,000ల వరకు బోర్లు వేస్తున్నారు. బోర్లు వేసే సమయంలో శాసీ్త్రయ పద్ధతులు పాటించడం లేదు. దీంతో 30శాతం వాటిలో మాత్రమే నీళ్లు పడుతున్నా యి. చాలా మంది రైతులు మూఢనమ్మకాలతో నీటి లభ్యత తెలుసుకునే ప్రయత్నం చేసి చేతులు కాల్చుకుంటున్నారు. లక్షలాది రూపా యలు ఖర్చు చేసి అప్పులపాలవుతున్నారు. సాధారణంగా బోరు బా వి తవ్వాలంటే తప్పని సరిగా ప్రభుత్వ అను మతి పొందాలి. కానీ వేల సంఖ్యలో బోర్లు వేస్తున్నా ఒక్కశాతం కూడా అనుమతులు తీసుకోవడంలేదు. రెవెన్యూ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తూ బోర్ల దందాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వర్షాకాలంలో రికార్డు స్థాయిలో వానలు పడుతున్నా మార్చి నాటికి భూగర్భ నీటిమట్టం అదే స్థాయిలో పడిపోతోంది. ఏటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే విపరీతంగా ఉన్న బోరుబావులు, విచ్ఛలవిడిగా నీటి వాడకం కారణంగా ఏప్రిల్‌, మే మాసాల్లో పంటలు ఎండబెట్టుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం జిల్లాలో లక్షకు పైగా వ్యవసాయ బోరుబావులు ఉండగా 25 వేల పైచిలుకు ఇళ్ల అవసరాల కోసం తవ్విన కనెక్షన్లు ఉన్నాయి.

కేవలం నాలుగింటికే..

బోరుబావి తవ్వాలంటే తప్పని సరిగా భూగర్భ జలవనరులశాఖ నుంచి అనుమతి పొందాలి. వాల్టా చట్టం ప్రకారం ముందుగా తహసీల్దార్‌కు దరఖాస్తు చేయాలి. వారు భూగర్భ జల వనరుల శాఖకు రెఫర్‌ చేస్తారు. ఆ శాఖ జియాలజిస్టులు వచ్చి నీటి లభ్యతను పరిశీలించి నీళ్లు ఉన్నాయని నిర్ధారణ అయితే అనుమతి ఇస్తారు. ఆ తరువాత బోరు వేసుకోవాలి. కానీ ఈ పద్ధతి ఎక్కడా అమలు కావడం లేదు. జిల్లాలో నెలకు సగటున 300ల పై గా బోర్లు తవ్వుతున్నట్టు అంచనా.. ఈ లెక్కన ఏటా 2,500 నుంచి 3,000 బోర్లు వేస్తున్నట్లు సమాచారం. కానీ గత ఏడాది కాలంలో కేవలం నాలుగంటే నాలుగింటికి మాత్రమే భూగర్భ జల వనరుల శాఖ నుంచి అనుమతులు పొందారు. అలాగే ప్రతి బోరు బండికి భూగర్భ జలవనరుల శాఖ జిల్లా కార్యాలయంలో రిజిస్ట్రర్‌ చేయించుకోవాలి. కానీ జిల్లాలో 80 పైచిలుకు బోరు బండ్లు ఉన్నా కేవలం ఏడు వాహనాలకు మాత్రమే రిజిస్ట్రర్‌ చేసుకున్నారు.

అవగాహన లేక..

బోరుబావులు తవ్వే రైతులు నేటికీ మూఢ నమ్మకాలనే పాటిస్తున్నారు. ఇప్పటికీ 70 శాతం మంది రైతులు కొబ్బరికాయతో, ఇతర మంత్ర తంత్రాలు చేసే వారి ద్వారా నీటి లభ్యతను తెలుసుకుంటున్నారు. కనీస అవగాహన లేక పదుల సంఖ్యలో బోర్లు తవ్వించి అప్పులపాలవుతున్నారు. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యల వైపు మొగ్గుచూపుతున్నారు. రైతులకు అవగాహన కల్పించాల్సిన అధికారులు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా జియాలజిస్టులు చూపుతున్న పాయింట్లలో సైతం సగానికిపైగా నీళ్లు పడటం లేదు.

నిబంధనలు గాలికి..

జిల్లాలో లక్ష పైచిలుకు వ్యవసాయ బోరుబావులు, 25 వేల పైచిలుకు ఇంటి బోర్లు ఉన్నాయి. 12 వేల వరకు అనుమతి లేని బోరువులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక బోరుబావికి మరో బోరుబావి మధ్య కనీసం 80 మీటర్ల దూరం ఉండాలి. అదే ప్రజావసరాలకు వినియోగించే బోరుబావికి అయితే 250 మీటర్ల దూరం పాటించాలి. కానీ ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. కొన్ని ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే 1000 ఫీట్ల వరకు డ్రిల్లింగ్‌ చేస్తున్నారు.

అనుమతులు తప్పనిసరి

బోరుబావులు తవ్వే వారు తప్పని సరిగా అనుమతులు పొందాలి. లేదంటే సంబంధిత యజమాని తోపాటు బోరు బండి నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకుంటాం. అనుమతి లేకుండా బోర్లు వేస్తుంటే తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయాలి. అలాగే నీటి లభ్యత తెలుసుకునేందుకు రైతులు అశాసీ్త్రయ పద్ధతులు వీడాలి. బోరు కోసం దరఖాస్తు చేసుకుంటే నీటి లభ్యతను పరిశీలించి అనుమతులు ఇస్తాం.

– రవిశంకర్‌,

భూగర్భ జలవనరుల శాఖ జిల్లా అధికారి

వాల్టా.. పల్టా 1
1/1

వాల్టా.. పల్టా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement